బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్లు ఉంటారా? నో వే! ప్రతి ఒక్కరికీ బిర్యానీ అంటే ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. ఒకరికి వెజ్ బిర్యానీ ఇష్టం, మరోకరికి చికెన్ బిర్యానీ అంటే ప్రాణం, మరికొందరికి మటన్ బిర్యానీ తిన్నప్పుడే విందు పూర్తి అయినట్టుగా అనిపిస్తుంది. పెళ్లిళ్లైనా, పార్టీలైనా, ఫంక్షన్లైనా — బిర్యానీ లేకుండా ఏ వేడుకనూ ఊహించలేము. కానీ ఇప్పుడు ఈ బిర్యానీ కేవలం ఆకలి తీర్చడానికే కాదు, ఓట్లు రాబట్టే ఆయుధంగా కూడా మారిందనే మాట బీహార్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.మనందరికీ తెలిసిందే — బీహార్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6 మరియు నవంబర్ 11వ తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. శుక్రవారం నాటికి నామినేషన్ల గడువు ముగియనుండటంతో, అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ పత్రాలను దాఖలు చేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం రోజు బహదూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి తౌసిఫ్ అలం, తన నామినేషన్ సందర్భంగా ప్రత్యేకంగా ఒక బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన తన నివాసంలో ప్రార్థనలు చేసి, అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల కోసం విందు ఏర్పాటు చేశారు. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది “బిర్యానీ విందు.”అయితే ఆ విందు సమయంలో పెద్ద గందరగోళం నెలకొంది. బిర్యానీ పాకెట్ల కోసం జనాలు క్యూలు కట్టగా, తర్వాత కొంతమంది ఆకలికి తల్లడిల్లి పరస్పరం తోసుకుంటూ, కొట్టుకుంటూ వెళ్లారు. ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

“ఇంత దయనీయ స్థితిలో ఉన్నారా మన భారతీయులు?”.“ఇది రాజకీయ పిచ్చి కాదు, ఆకలి దౌర్భాగ్యం!”,“బిర్యానీ తినిపించి ఓట్లు కొట్టేయాలని చూస్తున్నారా?”అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఈ ఘటనను చూసి “అక్రమ వలసదారులు మాదిరిగా కొట్టుకుంటున్నారు” అంటూ విమర్శించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో మజ్లిస్ పార్టీ  స్పందించింది. వారి ప్రతినిధులు స్పష్టతనిస్తూ,“హనుమాన్ చాలీసా తర్వాత ప్రసాదం ఎలా పంచుతారో, మేము కూడా ప్రార్థన తర్వాత 2000 మందికి బిర్యానీ విందు ఏర్పాటు చేశాం. కానీ జనసందోహం అనుకున్నదానికంటే ఎక్కువగా రావడంతో కొంత గందరగోళం చోటు చేసుకుంది,” అని వివరణ ఇచ్చారు.

అయితే అప్పటికే ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద హీట్ టాపిక్‌గా మారిపోయింది. బీహార్ ఎన్నికల్లో బిర్యానీ వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ — అన్నీ గాలివానలా విస్తరిస్తున్నాయి. నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు —“బిర్యానీ పార్టీ ఇస్తే ఓట్లు వేస్తామని అనుకున్నావా?“ఇంత సీన్ లేదు నీకు!” అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల సీజన్‌లో బీహార్ రాజకీయ చర్చల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతుంటే, మరోవైపు బిర్యానీ డిప్లమసీ బీహార్‌లో ప్రజల మనసుల్లో కొత్త రుచిని తెచ్చేసింది!


మరింత సమాచారం తెలుసుకోండి: