
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఇచ్చిన హామీని ఆయన తాజాగా నిలబెట్టుకున్నారు.
సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలు మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మినహాయింపును ప్రకటించారు. ఈ చొరవ వల్ల 1551 మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా రైతులకు తమ భూములు తిరిగి దక్కడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది మాత్రమే కాక, పవన్ కళ్యాణ్ మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ మినీహార్బర్ వద్ద దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం నుంచి రూ.72 లక్షల నష్టపరిహారం విడుదలయ్యేలా చేశారు. ఈ నిర్ణయంతో మత్స్యకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పదవి చేపట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో చూపుతున్న చొరవ ప్రజా నాయకుడిగా ఆయన విశ్వసనీయతను పెంచుతోంది. మాటంటే మాట, ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఆయన చూపిన చిత్తశుద్ధిని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయన తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు, కృషి పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రైతులకు, మత్స్యకారులకు అండగా నిలబడటంతో పాటు, రాష్ట్రంలో ఇతర కీలక సమస్యల పరిష్కారంపై కూడా ఆయన దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత, ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల స్థాయిలో వేగవంతమైన కదలిక కనిపించేలా చేస్తున్నారు. సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఆయన సంకల్పానికి ఈ నిర్ణయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి