సోషల్ మీడియా – టెక్నాలజీ – విజువల్ ఎఫెక్ట్స్ ఇవే ఇప్పుడు రాజకీయ యుద్ధంలో కొత్త ఆయుధాలు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే ఫార్ములాతో ప్రచార రంగంలోకి దిగారు. ఈసారి కేటీఆర్ చేసిన వినూత్న ప్రయోగం ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ ఐటీ మంత్రి గానే కాకుండా, టెక్నాలజీకి పితామహుడిలా వ్యవహరిస్తూ కేటీఆర్ తన ప్రచారాన్ని “డిజిటల్ దాడి” గా మార్చేశారు. హైడ్రా వ్యవహారాన్ని - అంటే హైదరాబాద్‌లో గరీబోళ్ల ఇళ్లు కూల్చివేత వివాదాన్ని — రాజకీయంగా మలిచి ఎమోషనల్ పిచ్గా మార్చేశారు.
జూబ్లీహిల్స్‌లో ప్రచార ర్యాలీల్లో, రోడ్ షోలలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయించి, హైడ్రా బాధితుల వీడియోలు ప్లే చేయిస్తున్నారు. “మా ఇల్లు కూల్చేశారు… మేము ఎక్కడికి పోవాలి?” అంటూ ఏడుస్తున్న మహిళల గోడును ప్రజలకే వినిపిస్తున్నారు. ఆ వీడియోలలోని భావోద్వేగం చూసిన వారిలో చలనం కలుగుతోందని చెప్పాలి. కేటీఆర్ మాట్లాడకముందే ఆ వీడియోలు వాతావరణాన్ని సెట్ చేస్తున్నాయి. తన ప్రసంగాల్లో ప్రతి సారి “హైడ్రా” అనే పదం తప్పక వస్తుంది. “ఇది కేవలం బోరబండ గల్లీలో కాదు… రేపు మీ ఇళ్లకు వస్తుంది. ఆపాలంటే కారు బటన్ నొక్కండి!” అంటూ కేటీఆర్ ఓటర్లలో భయాన్ని, ఆవేశాన్ని కలగజేస్తున్నారు. ఇదే ఆయన ప్రచార మంత్రం. కేటీఆర్ మాటల్లో, “ఇందిరమ్మ రాజ్యం అంటూ గరీబోళ్ల ఇళ్లు కూల్చిన ప్రభుత్వం, ప్రజల ఇళ్లపై హైడ్రా రూపంలో దాడి చేసింది.
ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని నిలువరించాలి.” అంటూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కోసం కేటీఆర్ స్వయంగా కమాండ్ తీసుకోవడం, ప్రతి ప్రచారాన్ని డిజిటల్ ఆర్ట్ పీస్‌గా మార్చడం - ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. అయితే ప్రశ్న ఒక్కటే — హైడ్రా హావా కేటీఆర్‌కి వర్కవుట్ అవుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈ ప్రచారానికి ప్రతిస్పందిస్తూ “హైడ్రా వెనక అసలు కథ కేటీఆర్‌దే” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ప్రారంభించింది. మొత్తానికి, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గ పోరు కాదు - ఇది “డిజిటల్ ప్రచారం vs గ్రౌండ్ వర్క్” యుద్ధం. కేటీఆర్ టెక్నాలజీతో చేసిన హైడ్రా ప్రచారం ఎఫెక్ట్ చూపుతుందా లేక రేవంత్ ఫీల్డ్ ఫోర్స్ బలపడుతుందా అన్నది నవంబర్ 9నే తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి