ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నా, రాజకీయ కసరత్తులు మాత్రం ఇప్పటికే మొదలయ్యాయి. ముందస్తు ఎన్నికల గురించి చర్చలు ఉన్నా ఇప్పటి వరకు అలాంటి స్పష్టమైన సంకేతాలు లేవు. అయినా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలలో నాయకులు తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూ, సీట్ల కోసం కర్చీఫ్‌లు వేస్తున్నారు. ఈ తొందరపాటు రాజకీయాలతో పలు నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు చెలరేగుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 12 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఇప్పటికే యాక్టివ్ అయిపోతున్నారు. వీరిలో కొందరు గ‌త‌ ఎన్నికల్లో టిక్కెట్ కోల్పోయినవారు, మరికొందరు ఇతర పార్టీలకు వెళ్లి ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నవారు కూడా ఉన్నారు.


“ఘర్ వాపసీ” పిలుపునిచ్చిన జగన్ ఈ తరహా నేతలకు అవకాశం ఇవ్వాలని సంకేతాలు ఇచ్చారు. దీంతో తిరిగి పార్టీలోకి రావాలనుకునే నేతలు తమ పాత సీట్లు దక్కుతాయా అన్న ఆశ‌ల్లో ఉన్నారు. పార్టీ అంతర్గతంగా కూడా సీట్ల కేటాయింపులపై చర్చ మొదలైంది. తాడేపల్లి వర్గాల సమాచారం ప్రకారం, కొందరు ప్రస్తుత ఇన్‌చార్జ్‌లను మార్చడం వల్ల స్థానికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. కొంతమంది నాయకులు ముందే కర్చీఫ్ వేసి మేమే అభ్య‌ర్థులం, మాకే సీట్లు అంటూ ప్రదర్శనలు చేయడం వైసీపీ లోపల అసహనం రేపుతోంది. “ఇతర పార్టీల నుంచి రావడంలో తప్పు లేదు కానీ, ముందే సీటు దక్కించుకోవాలనే ఆలోచన మాత్రం అతి” అని సీనియర్ నేతలు గుసగుసలాడుతున్నారు.


ఇలాంటి పరిస్థితి టీడీపీ, జనసేన పార్టీల్లోనూ ఉంది. గత‌ ఎన్నికల్లో టిక్కెట్ కోల్పోయిన వారు లేదా చివరి నిమిషంలో త్యాగం చేసిన వారు ఇప్పుడు తమ స్థానం తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. బయటకు చూస్తే ఇది రాజకీయ చైతన్యంలా కనిపించినా, లోపల మాత్రం “ కర్చీఫ్ రాజకీయం ” నడుస్తోంద‌ట‌. ఈ అంతర్గత విభేదాల‌తో రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నా.. ప్రతి పార్టీ లోపల సీట్ల కోసం దారుణమైన రగడ మొదలైంది. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠను తీసుకురావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: