నాయకుల బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలు .. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లోని పార్టీ కార్యాలయ విభాగాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు కేవలం తమకు నచ్చిన కార్యకర్తలనే కాకుండా, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్లను కూడా కలుపుకొని పోవాలని ఆదేశించారు. "ప్రతి రోజు కార్యాచరణను అమలు చేసి, వారానికోసారి విశ్లేషించి, నెలకోసారి సమీక్షించి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాను. ప్రతిఒక్కరి పనితీరుకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది" అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీని ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తలతో వారి సంబంధాలను తాను నిశితంగా గమనిస్తున్నానని సంకేతాలిచ్చారు.
కూటమి సమన్వయం - పెండింగ్ పోస్టుల భర్తీ .. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులను చైతన్యం చేయాలని నాయకులను కోరారు. అలాగే, కూటమిలోని పార్టీలతో సమన్వయం పాటించడం, పార్టీలో క్రమశిక్షణతో, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచాలని సూచించారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను మరియు ట్రస్ట్ బోర్డ్ కమిటీలను వెంటనే భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి! .. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు, అసత్య ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పిపిపి (PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుతాయని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, ‘మొంథా’ తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు, ప్రజలకు అండగా నిలబడితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం 'విషం చిమ్ముతున్నాడని' మండిపడ్డారు.\
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి