- ( అమ‌రావ‌తి ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా మరియు అభివృద్ధి పరంగా కీల‌క ద‌శ‌లోకి అడుగు పెడుతోంది. ఏపీ ముఖ చిత్రం మారబోతోంది. కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్విభజనకు సీరియస్‌గా అడుగులు వేస్తోంది. అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల బృందం దీనిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. ప్రజల డిమాండ్ మేరకు రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుత జిల్లాల హద్దులను డివిజన్‌ల వారీగా మార్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. వైసీపీ పాలనలో జరిగిన జిల్లాల విభజనపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మదనపల్లె, మార్కాపురం, రాజంపేట, నరసాపురం వంటి ప్రాంతాల ప్రజలు తమ జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉన్నాయని, వాటిని సవరణ చేయాలని పదేపదే విన్నవించినా, అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు.


కూటమి ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన “మూడు మెగా సిటీలు” ప్రణాళిక కూడా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతుంది. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి నగరాలను “మెగా సిటీలుగా” అభివృద్ధి చేయాలని చంద్ర‌బాబు నిర్ణయించారు. అమరావతి మెగా సిటీలో గుంటూరు, విజయవాడ, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలను కలిపి ఒక సమగ్ర అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దనున్నారు. విజయం­వాడ–మంగళగిరి మధ్య కృష్ణా నదిపై రెండు ఐకానిక్ వంతెనలను ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.


తిరుపతి మెగా సిటీ పరిధిని సత్యవేడు, నగరి, పూతలపట్టు వరకు విస్తరించి, పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం మెగా సిటీని మరో దశకు తీసుకెళ్లే క్రమంలో విజయనగరం దాకా అభివృద్ధి విస్తరించనుంది. పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, టూరిజం రంగాల్లో కూడా భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే, జిల్లాల పునర్విభజనతో పాటు మెగా సిటీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయి. పరిపాలనా పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ప్రవాహం ఈ మూడు అంశాలు కలిపి “ ఏపీ ముఖ చిత్రం ” ని సమూలంగా మార్చబోతున్నాయని విశ్లేషకుల అంచనా. కూటమి ప్రభుత్వం ఈ ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే, ఆంధ్రప్రదేశ్ మళ్లీ దేశంలో అభివృద్ధి రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: