వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. 2019లో జరిగిన ఈ దారుణ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ తుఫానును సృష్టించింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు న్యాయం కోసం పోరాడుతూ వస్తున్న వ్యక్తి డాక్టర్ నర్రెడ్డి సునీత. తన తండ్రి హత్యకు కారణమైన వారిని శిక్షించాలన్న ధ్యేయంతో ఆమె న్యాయ యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎన్నో బెదిరింపులు, అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. అయితే వైసీపీ పాలనలో సునీతకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తండ్రి హత్య కేసులో బాధితురాలైన ఆమెపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. కడప పోలీస్ స్టేషన్‌లో సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి కేసులు నమోదు చేశారు.


ఇక ఇది రాజకీయ దౌర్జన్యంగా విపక్షాలు ఆరోపించాయి. కానీ, ఇప్పుడు ఆ అన్యాయం సరిదిద్దబడింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ కేసులను కొట్టి వేసింది. “సునీత దంపతులపై నమోదైన కేసులకు ఎలాంటి ఆధారాలు లేవు” అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సునీతకు ఒక పెద్ద రిలీఫ్ దక్కింది. అయితే, ఇంతటితో ఆగకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. సమాచారం ప్రకారం, రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ రిటైర్ అయినప్పటికీ, వారిపై విభాగ దర్యాప్తు కొనసాగించనున్నారు. అంతేకాక, రిటైర్మెంట్ తర్వాత అందుకునే ఆర్థిక ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.



 వీరి వెనుక నిజంగా ఎవరు ఉన్నారో, ఎవరి ఆదేశాలతో ఈ కేసులు నమోదయ్యాయో అన్న అంశంపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, లింగాల ప్రాంతానికి చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి “సునీతపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలి” అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది. ఒకప్పుడు ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసిన అధికారులే ఇప్పుడు నిందితులుగా మారడం నిజంగా విశేషం. మొత్తంగా ఇన్నేళ్ల న్యాయ యుద్ధం తర్వాత సునీతకు కొంత న్యాయం లభించినట్టయింది. వివేకా హత్య కేసులో ఆమెకు ఇది న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన విజయంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: