ఏపీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రస్తుతం ఒకటే చర్చ – మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఆ పోస్ట్‌కి ఆయన పెట్టిన టైటిల్ “Public Apology (బహిరంగ క్షమాపణ)”. అందులో ఆయన నేరుగా ఇద్దరు ప్రముఖ అధికారులైన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌లకు క్షమాపణలు చెప్పారు. వైసీపీ పాలనలో ఈ ఇద్దరిపై అన్యాయంగా కేసులు నమోదయ్యాయని, ఆ నిర్ణయాల వెనుక ప్రవీణ్ ప్రకాష్ పాత్ర ఉందని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఇప్పుడు ఆయన స్వయంగా “ఆ సమయంలో నాతోనుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి” అంటూ అంగీకరించడంతో ఆ విషయంపై కొత్త చర్చ మొదలైంది.


ప్రవీణ్ ప్రకాష్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు – “నేను 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేశాను. విజయవాడ, గుంటూరు మునిసిపల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించాను. కానీ తర్వాత నాపై విమర్శలు, ట్రోల్స్ పెరిగాయి. చివరికి ఆ ఒత్తిడి కారణంగానే రిటైర్మెంట్ తీసుకున్నాను.” అని అన్నారు. తరువాత ఆయన 2020లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన ఒక ఫైల్ గురించి ప్రస్తావిస్తూ – “డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌లో ఆయనపై చర్యలు తీసుకోవాలన్న సూచన ఉంది. కానీ ఆయనపై ఉన్న అభియోగాలు సివిల్ సర్వీస్ నిబంధనలకు సరిపోలేదు. అయినా నేను సంతకం చేయాల్సి వచ్చింది. ఇది నైతికంగా నన్ను కృంగదీసింది” అని పేర్కొన్నారు.


అదే విధంగా జాస్తి కృష్ణకిషోర్ విషయంలో కూడా తాను తీసుకున్న నిర్ణయాలు సరైనవికావని అర్థమైందని చెప్పారు. “ఈ ఇద్దరినీ వ్యక్తిగతంగా ఫోన్‌లో సంప్రదించి క్షమాపణ చెప్పాను. కానీ ఇప్పుడు బహిరంగంగా సమాజం ముందు కూడా సారీ చెబుతున్నాను. నేను చేసిన తప్పులకీ, అనుకోకుండా వారిని బాధపెట్టిన నిర్ణయాలకీ క్షమించమని కోరుతున్నాను” అని ప్ర‌వీణ్ స్పష్టం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ఈ బహిరంగ క్షమాపణతో ఏపీ బ్యూరోక్రసీలో చర్చ రేగింది. కొందరు ఆయన నిజాయితీని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇది రాజకీయ ఉద్దేశ్యంతో చేసిన చర్య అని అంటున్నారు. కానీ ఒకటే నిజం – “ప్రవీణ్ ప్రకాష్ Public Apology” ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ – పరిపాలనా వర్గాల్లో కొత్త హాట్ టాపిక్‌గా మారింది.


https://www.instagram.com/reel/DQ8jbXpk0MQ/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==






మరింత సమాచారం తెలుసుకోండి: