ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ స్థాయి వేదికపై అరుదైన ప్రశంసలు లభించాయి. “ సరైన సమయంలో సరైన నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా అదృష్టం ” అంటూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబుపై విస్తృతంగా ప్రసంశలు కురిపించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ తనకు చంద్రబాబు విజన్ చాలా దగ్గరగా తెలుసునని పేర్కొన్నారు. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న కాలం నుంచే చంద్రబాబు సంస్కరణల చక్రం తిప్పుతున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు, ధైర్యవంతమైన సంస్కరణలు అమలు చేసి, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.


ముఖ్యంగా విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అప్పట్లో పెద్ద సవాలుగా ఉన్నా వాటిని విజయవంతంగా అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. “ ఒకప్పుడు సంస్కరణలు అంటే ప్రజలు భయపడే కాలం. అలాంటి సమయంలో వాటిని అమలు చేసి ధైర్యంగా ముందుకు సాగిన నాయకుడు చంద్రబాబు. ఆయన్ను నేను చాలా దగ్గరగా చూశాను… ఆయన నిజమైన పాలనాదక్షుడు ” అని ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు లాంటి నాయకత్వం తప్పనిసరి అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన దూరదృష్టి, పెట్టుబడులను ఆకర్షించే నైపుణ్యం, సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ చంద్రబాబులో ఉన్నాయని ఆయన కితాబు ఇచ్చారు.


“ఎక్కడ అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అక్కడ చంద్రబాబు ఉంటారు. ఏదైనా మంచి చేయాలన్నదే ఆయన తలంపు. అందుకే నేటికీ ఆయన విజన్ అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా కొనసాగుతోంది ” అని రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులను దూసుకురావడంలో చంద్రబాబు ‘ఘనాపాఠి’ అని చెప్పడం విశేషం. ఇదే సందర్భంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూడా రాధాకృష్ణన్ ప్రశంసించారు. గత 11 సంవత్సరాలుగా మోదీ సర్కారు పేదల జీవన ప్రమాణాలను పెంచే దిశగా సమగ్ర కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కోట్లాది కుటుంబాలకు సొంతింటిని నిర్మించి ఇచ్చిన ‘ఆవాస్’ పథకం దేశ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని అన్నారు.


అలాగే యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా కేంద్రం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించడం, మరోవైపు మోదీ సర్కారు పనితీరును పొగడటం జాతీయ, రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: