ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటిష్ పాలన పోయి దానికి మించిన పాలన వచ్చిందని వైయస్సార్ కడప జిల్లా పొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.. జిల్లాలో పోలీసుల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటి పాలన చూడలేదని, వీళ్ళకంటే బ్రిటిష్ పాలనే మేలని సూచించారు. గత రెండు రోజుల క్రితం బంగారం వ్యాపారి అయినటువంటి తనికంటి శ్రీనివాసులు వ్యాపారం ముగించుకొని తన భార్యతో ఇంటికి వెళుతున్న సమయంలో పుట్టపర్తి సెంటర్లో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కనీసం రీజన్ చెప్పకుండా రెండు రోజులపాటు పోలీసుల కస్టడీ లోనే ఉంచారు. శ్రీనివాసులను అరెస్టు చేయడానికి ప్రధాన కారణం తన తమ్ముడు అని తెలుస్తోంది. బ్రదర్ వెంకటస్వామి పలువురు దగ్గర అప్పులు చేయడంతో అవి రాబట్టేందుకు అన్నను తీసుకెళ్లడం జరిగింది. 

శ్రీనివాసులకు అతని తమ్ముళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. కానీ పోలీసులు అకారణంగా అరెస్టు చేసి రెండు రోజులు వారి వద్ద ఉంచుకోవడంతో ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ఇదే సమయంలో వరదరాజుల రెడ్డి  మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అంటూ ప్రశ్నించారు. రాత్రి సమయంలో పోలీసులు బంగారు వ్యాపారులను సీక్రెట్ గా అరెస్టు చేసి తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. సివిల్ ఇష్యూస్ లో  పోలీసులు ఎంటర్ అవ్వడం ఏంటని  ఎమ్మెల్యే నిలదీశారు. పొద్దుటూరు పోలీసులు ఏడు కోట్ల సెటిల్మెంట్ చేయాలని తనికంటి శ్రీనివాసులుని ఎత్తుకెళ్లారని మండిపడ్డారు. అయితే రెండు రోజులైనా తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య నా వద్దకు వచ్చి మొరపెట్టుకుందని వెంటనే వన్ టౌన్ సిఐ కి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగితే తమ దగ్గరే ఉన్నారని 45 నిమిషాల తర్వాత సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు.. 

అలాగే బంగారం అంగడికి పోలీసులు తాళాలు వేయడమేంటని మండిపడ్డారు. రెండు రోజులైనా కానీ ఇలా పోలీసులు నిర్బంధించి ఉంచడం ఏంటని వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పొద్దుటూరు నియోజకవర్గం లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత డిఎస్పి పై ఉందని, చట్టాన్ని కిందిస్థాయి అధికారులు అమలు చేస్తున్నారా లేరా అనేది పట్టించుకోవాలన్నారు. కానీ డిఎస్పి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం  మంచి పద్ధతి కాదన్నారు. ఈ పోలీస్ పాలన చూస్తుంటే బ్రిటిష్ పాలనే తలపిస్తోందని వాపోయారు. ఈ ఇష్యూను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: