గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అందుబాటులో ఉండటంతో, శ్రీశైలం హైవే వైపు నగర విస్తరణకు దీన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీపైనే రేవంత్ నమ్మకం .. ఏ ప్రతిష్టాత్మక సంస్థ వచ్చినా, ముందుగా ఫ్యూచర్ సిటీనే చూపించి, అక్కడే పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొన్ని సంస్థలకు భూముల కేటాయింపులు జరిగాయి. అలాగే, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని మరో సైబరాబాద్‌లా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ మూడు వైపులా జరిగింది కానీ, శ్రీశైలం హైవే వైపు అనుకున్నంత పెరగలేదు. అందుకే, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి, వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌ను ‘న్యూయార్క్’లా మార్చేలా ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడం, నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు.
సదస్సుతో ఇన్వెస్టర్లను ఆకర్షించగలరా? .. అయితే, ఇప్పటి వరకూ భారీ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రకటన రాలేదు. సీఎం ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ తన కార్పొరేట్ గ్లోబల్ ఆఫీస్‌ను 10 ఎకరాల్లో ఇక్కడ నిర్మించాలని నిర్ణయించడంతో పాటు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు నిర్మించనున్నాయి. ఇంకా గాడినా పడని ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి చూపించడం పారిశ్రామిక వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నా, అక్కడ ఏమీ లేకపోయినా ఘనంగా సదస్సు నిర్వహించి, భవిష్యత్తులో అది గొప్ప నగరంగా రూపుదిద్దుకోబోతోందని పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ వ్యూహంలో రేవంత్ సక్సెస్ అయి, దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే, అది ఆయనకు గొప్ప విజయంగా, నగరాల నిర్మాణంలో జరుగుతున్న పోటీలో తెలంగాణను రేసులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి