తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరుకు సంబంధించి మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు మొదలై శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికలలో అనుకున్నంత స్థాయిలో స్పందన లేదంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలలో డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో మాత్రం డబ్బు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల చాలామంది పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సర్పంచ్ ,ఉప సర్పంచ్ ఎన్నికల హడావిడి కనిపించడం లేదు.


మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,236 గ్రామాలలో నామినేషన్లు జరగగా.. ఇందులో సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు ఈనెల 11న జరగబోతున్నాయి. వీటికి సంబంధించి కనీసం 80 వేల నామినేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేసుకున్నప్పటికీ కేవలం 37,440 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. అలాగే మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏకగ్రీవం ఎన్నికలు జరిగాయని అధికారులు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల సర్పంచ్ లేకుండా వార్డు మెంబర్లు కూడా సింగిల్ నామినేషన్ దాఖలు కావడం చేత ఏకగ్రీవమైంది.ఇలా వీటన్నింటిని లెక్కేసి సోమవారం రోజున అర్హత ఉండేటువంటి నామినేషన్ల వివరాలను తెలియజేస్తామని అధికారులు తెలుపుతున్నారు. అలాగే డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుందని తెలియజేశారు.


డిసెంబర్ 2వ తేదీన రెండవ దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేయబోతున్నారు.  4,333 పంచాయితీలలో ఎన్నికలు జరగనుండగా ఇందులో కూడా కొన్ని వేలంపాట జరగబోతున్నాయి ,మరికొన్ని ఏకగ్రీవంగా  జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఒక సర్పంచ్ పోస్టుకి రూ.20 లక్షలకు ఒక వ్యక్తి పాడుకున్నప్పటికీ తాజాగా నల్గొండ జిల్లాలోని చిన్నఅడిశర్లపల్లి  గ్రామ పంచాయతీకి సంబంధించిన వెంకటయ్య గౌడ్ ఏకగ్రీవమయ్యారు.. తనను ఏకగ్రీవంగా ఎంచుకుంటే రూ.50 లక్షల రూపాయలు గ్రామానికి అందిస్తానని చెప్పడంతో ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.. ఈ గ్రామంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: