శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఏర్పడిన అనూహ్య పరిస్థితి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాల్లో ఒక్కసారిగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో, అత్యవసరంగా బయలుదేరాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయారు. ముఖ్యంగా శంషాబాద్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళ వైపు బయలుదేరాల్సిన విమానాలను సంస్థ రద్దు చేయడం వల్ల దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ఏం జరుగుతోందో, ఎప్పుడు ప్రయాణం పునః ప్రారంభమవుతుందో ఇండిగో సంస్థ స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం ప్రయాణికుల ఆగ్రహానికి కారణమైంది. ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నప్పటికీ వారికి తగిన సౌకర్యాలు కల్పించలేదని, పౌర ఇన్ఫర్మేషన్ లేకుండా ఎదురుచూడాల్సి వస్తోందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. పలు ఫ్లైట్లకు టికెట్లు బుక్ చేసుకుని తమ గమ్యస్థానాలకు అత్యవసర రీతిలో వెళ్లాల్సినవారికి ఈ ఆలస్యం మరింత ఇబ్బంది కలిగిస్తోంది.
ప్రత్యేకంగా శబరిమలకు వెళ్లేందుకు ముందుగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న దాదాపు 200 మందికి పైగా భక్తులు కూడా ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నే ఉండిపోయారు. డిసెంబర్ నెల కారణంగా శబరిమల సీజన్ నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. రద్దీ ఎక్కువు గా ఉండగా ఈ విమానాల రద్దు తో భక్తుల్లో ఆందోళన కనిపిస్తోంది. విమానాల్లో సమస్యలేమిటన్నదానిపై ఇండిగో సిబ్బంది ని అడిగినా స్పష్టత లేకపోవడం , సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అధికారులు సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, విమాన సేవలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయన్నదాని పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యం, సమాచార వ్యవస్థ పటిష్టం కావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి