విద్యాదానం అన్ని దానాలలోకెల్లా ఎంతో విలువైనది, వెలకట్టలేనిది అని చెబుతారు. అలాంటి మహోన్నతమైన దానాలను ఎన్నో చేసిన ఘనత విజయనగరం పూసపాటి సంస్థానాధీశులది. వందల, వేల ఎకరాల భూమిని వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల కోసం, వారి ప్రయోజనాల కోసం వినియోగిస్తూ, అవసరమైన పక్షంలో వితరణ చేసేందుకు సైతం వెనుకాడని గొప్ప గుణం పూసపాటి రాజులది. తాజాగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మాస్ ప్రశంసలు అందుకుంటోంది!


130 ఎకరాలు ఉచితం: ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ! .. పూసపాటి వంశీయులు దాదాపు ఏడు దశాబ్దాల క్రితం మాన్సాస్ ట్రస్ట్ ద్వారా విద్య, సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. తమకు ఉన్న కోటలను, మేడలను, ఖాళీ ప్రదేశాలను విద్యా సంస్థలకు అందించారు. అలాంటి గొప్ప వంశానికి చెందిన, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఇప్పుడు ఉత్తరాంధ్రాలో మరో మహోన్నతమైన విద్యా సంస్థ కోసం 130 ఎకరాలకు పైగా మాన్సాస్ ట్రస్ట్ భూములను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు.


విశాఖ జిల్లా, భీమిలీ నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలో 'ఏవియేషన్ ఎడ్యుసిటీ' ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు కావాల్సిన భూమి విషయంలో ఆలోచనలు జరుగుతున్న సమయంలో, పూసపాటి వంశీకులు తమకు అక్కడ ఉన్న మాన్సాస్ ట్రస్ట్‌కు చెందిన భూములను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం గొప్ప విషయంగా అంతా కొనియాడుతున్నారు. 'రూపాయి' కూడా వద్దు: ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాస్ స్టాండ్! .. ఈ ఎంవోయూ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం వచ్చినప్పుడు... సీఎం సెక్రటరీ "ఉచితంగా భూమి ఇవ్వడం సాధ్యం కాదు, కనీసంగా టోకెన్ అమౌంట్ కానీ, రూపాయి అయినా కట్టాల్సి ఉంటుందని" పేర్కొన్నారుట.


అయితే, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తీసుకున్న మాస్ స్టాండ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వందల ఎకరాల స్థలం వితరణకు బదులుగా కనీసం రూపాయి కూడా తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. పూసపాటి వంశీయులు ఆ 130 ఎకరాలను ఉచితంగా అందించారు. దీంతో, ఉత్తరాంధ్రాలో అతిపెద్ద ఏవియేషన్ రంగంలో ఎడ్యుకేషన్ సిటీ రాబోతోంది. ఈ ఎడ్యుకేషన్ సిటీ వల్ల ఏవియేషన్ రంగంలో వేలాది ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి, పూసపాటి వంశీకులు ప్రజా ప్రతినిధులుగానే కాకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి దాతలుగా కూడా తమ ఉదారతను నిరూపించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: