ముంబైలో జరిగిన ఈ సభలో, ఠాక్రే సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేదికపై కనిపించడంతో, పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐక్యతను ప్రత్యక్షంగా చూసిన కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో సభను హోరెత్తించారు. ఈ కలయికను ఉద్దేశించి సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ,“ఇది కేవలం రాజకీయ పొత్తు కాదు… ఇది ఒక శుభప్రదమైన ఆరంభం” అని అభివర్ణించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)తో పాటు ఇతర కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలంటే ఈ ఐక్యత అనివార్యం అని ఆయన స్పష్టం చేశారు.
సభలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో ప్రసంగించారు. తమ తాత ప్రబోధన్కర్ ఠాక్రే, తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలను గుర్తు చేసుకుంటూ,“ఈ రోజు ఇక్కడ మేము కేవలం ఇద్దరు వ్యక్తులుగా కాదు… ఠాక్రే సోదరులుగా నిలబడ్డాం” అని అన్నారు.
శివసేన స్థాపించి 60 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో..మరాఠీ ప్రజల హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. విడిపోయి పోరాడటం అంటే, మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు చేసే అవమానమే అవుతుందని ఆయన అన్నారు.
రాజ్ ఠాక్రే తన ప్రసంగంలో సంఘీభావాన్ని చాటారు.వ్యక్తిగత అపార్థాలు, విభేదాల కన్నా మహారాష్ట్ర గౌరవమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.సీట్ల పంపకాల కంటే కూడా ముంబై ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యం అని తెలిపారు.
ఈ పొత్తు ముంబై వరకే పరిమితం కాదని,నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ ఐక్యత కొనసాగుతుందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.ఈ రాజకీయ ఐక్యత ద్వారా ముంబై పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఠాక్రే సోదరుల ఈ పునఃకలయిక,మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బీఎంసీ ఎన్నికల నేపథ్యలో ఈ పొత్తు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
ఏది ఏమైనా,20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఒక్కటవడం — మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో మర్చిపోలేని ఘట్టంగా నిలిచిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి