జూబ్లీహిల్స్..మొన్నటి వరకు ఈ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎప్పుడైతే ఇక్కడ ఉప ఎన్నిక  జరిగిందో అప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం చాలా ఫేమస్ అయిపోయింది.. ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్, కాంగ్రెస్,బిజెపి పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది.. అయితే  ఈ నియోజకవర్గాన్ని గత రెండు పర్యాయాలు మాగంటి గోపీనాథ్ పాలించారు. ఆయన మరణంతో బై ఎలక్షన్స్ వచ్చాయి.. ఇంకేముంది అక్కడ అన్ని పార్టీలు వారి వారి స్టేటస్ లు ఉపయోగించి గెలవాలని ప్రయత్నం చేశాయి. కానీ నవీన్ యాదవ్ చేతిలో ఈ పార్టీలన్నీ చతికిలబడిపోయి ఓటమి పాలయ్యాయి.. అలాంటి నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఏంటి.. జూబ్లీహిల్స్ లో ఏ విధంగా ఉండేవారు అనే వివరాలు చూద్దాం..

 చదువు పూర్తి చేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టినటువంటి నవీన్ యాదవ్  రాజకీయాలపై ఆసక్తితో ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ కాకముందే సామాజిక సేవలో ఎంతో చురుకుగా ఉండేవారు. నవ యువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. పదవిలో లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ అందరికీ అండగా ఉన్నారు. నవీన్ యాదవ్ 2009లో తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు.  2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. మళ్లీ 2018లో జూబ్లీహిల్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 20 వేలకు పైగా ఓట్లు సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మూడు పదుల వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్  ఎక్కడా నిరాశ చెందకుండా గెలవాలనే పట్టు తోనే ముందుకు వెళ్తున్నారు. మళ్లీ 2023 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో చేరిపోయారు. అదే సమయంలో  మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ని బలపరిచారు. దీంతో అక్కడ 2023లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. కానీ ఆయన అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. చివరికి 2025లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఖరారు చేయడంతో ఎంతో కష్టపడి భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకప్పుడు జీరో స్థాయిలో ఉండే నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఒక హీరో అయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: