తెలుగుదేశం పార్టీలో అత్యంత దూకుడుగా ఉండే నాయకుల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. పార్టీ కోసం ప్రాణాలకైనా తెగించే తత్వం, కార్యకర్తల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే నైజం ఆయనది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని మునుపటి జోరు చూపించడం లేదని, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ నేతల చేరికలే కారణమా? చింతమనేని అసంతృప్తికి ప్రధాన కారణం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. గత ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో చింతమనేని అనేక కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్లారు. అప్పట్లో తను ఎదుర్కొన్న ఇబ్బందులకు కారణమైన వైసీపీ నేతలను ఇప్పుడు టీడీపీలోకి చేర్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.


ముఖ్యంగా మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు మేయర్ కుటుంబం వంటి వారు పార్టీలోకి రావడం, వారికే ప్రాధాన్యత దక్కడం చింతమనేని వర్గీయులను కలవరపెడుతోంది. కష్టపడిన వారికి గుర్తింపు ఎక్కడ? "ఐదేళ్లు కష్టపడి కేసులు మోసింది మేము.. ఇప్పుడు అధికారం రాగానే పీట వేసి కూర్చోబెడుతోంది వారినా?" అన్నది చింతమనేని అంతరంగం. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ నాయకత్వం వైసీపీ నుంచి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ, కేవలం తన నియోజకవర్గ పరిధిలోని పనులకే పరిమితం అవుతున్నారని తెలుస్తోంది.



 సంక్రాంతి పందేల బిజీలో... ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుండటంతో చింతమనేని తన నియోజకవర్గంలో కోడి పందేల నిర్వహణపై దృష్టి సారించారట. ఏటా ఆయన సంప్రదాయబద్ధంగా వీటిని నిర్వహిస్తుంటారు. రాజకీయాల కంటే ప్రస్తుతానికి పండుగ సందడిపైనే ఆయన ఫోకస్ పెట్టారు. అయితే, లోలోపల మాత్రం అధిష్టానం వ్యవహారశైలిపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని టాక్. చింతమనేని ప్రభాకర్ వంటి ఫైర్ బ్రాండ్ నేత మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాత తరం నాయకులను కాదని, కొత్తగా వచ్చే వారికి పెద్దపీట వేయడం వల్ల కేడర్‌లో కూడా అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ సీనియర్ నేతను ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: