కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కన్నడనాట ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ రంగంలోకి దిగారు. ఆదివారం జేడీఎస్ అధినేత దేవెగౌడను కలిశారు. ఎమ్మెల్యేల రాజీనామా, సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభంపై చర్చించారు. బీజేపీ ఆట కట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో ఉన్నట్లు తెలుసుకున్న డీకే.. వారిని ఎలాగైనా సంప్రదించి, వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

కన్నడనాట కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించిన శివ కుమార్.. నేడు ఆ ప్రభుత్వం సంక్షోభంలో ఉండటంతో మరోసారి రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ఎత్తులు వేస్తూ రాగా.. ఆ ఎత్తులన్నింటినీ డీకేఎస్ చిత్తు చేస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు కూడా. అయితే గతంలో అనేకసార్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పక్కా వ్యూహాంతో.. తన చేతికి మట్టి అంటకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

 

ఆ వ్యూహంలో భాగంగానే 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు అర్థమవుతోంది. ప్రతిసారి తన బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ వచ్చిన డీకేఎస్.. ఇసారి బీజేపీని ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలాఉండగా, 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వానికి పెనుగండం పొంచి ఉంది.

 

రాజీనామా చేసిన నేతలు తమ రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ ఉంటే ప్రలోభాలకు గురిచేస్తారనే ఉద్దేశంతో ముంబైలోని ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచే మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు 12 మంది ఎమ్మెల్యే రాజీనామాతో సంక్షీర్ణ ప్రభుత్వ బలం పడిపోయింది. దీంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: