అంతా బాగుందంటే అంతా బాగుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్ అనుకుంటున్నట్లు క్షేత్రస్ధాయిలో జనాలందరూ హ్యాపీగా ఉన్నారా ? అంటే పూర్తిగా అవునని చెప్పలేని పరిస్ధితి. సమస్యల పరిష్కారం కోసం తాము ఎంఎల్ఏలను కలుద్దామని అనుకుంటే అందుబాటులో ఉండటం లేదని జనాలు కొంతమంది ఎంఎల్ఏలపై మండిపడుతున్నారట.

 

ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం జగన్ కు రిపోర్టు రూపంలో స్పష్టంగా చెప్పిందట. ఎన్నికలు అయిన దగ్గర నుండి చాలామంది ఎంఎల్ఏలు జనాల్లోకి వెళ్ళటం మానేశారట. ఎలాగూ అధికారంలోకి వచ్చేశాం కదా అనే నిర్లక్ష్యం ఆవహించిందట చాలామందిని. అందుకనే అటు జనాలకు దొరక్కుండా ఇటు కనీసం పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా దొరకటం లేదని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట.

 

చంద్రబాబునాయుడు హయాంలో కూడా చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలకు పార్టీతో గ్యాప్ వచ్చేసింది. పార్టీ నేతలు, క్యాడర్ కు అవసరమైన పనులను కూడా అప్పట్లో మంత్రులు, ఎంఎల్ఏలు చేసిపెట్టలేదు. దాంతో నేతలు, క్యాడర్లో మంత్రులు, ఎంఎల్ఏలపై పేరుకుపోయిన కోపం చంద్రబాబు మీద ఎన్నికల సమయంలో చూపించారు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసిపి నేతలైనా, ఎంఎల్ఏలైనా పదే పదే జనాల్లోనే తిరుగుతూ, నిత్యం క్యాడర్ తో మంచి సంబంధాలే మెయిటెయిన్ చేశారు. దాని ఫలితంగానే చాలాచోట్ల  వైసిపి అభ్యర్ధులు మంచి మెజారిటితో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత మాత్రం నిర్లక్ష్యం వచ్చేసింది. అప్పటికీ జగన్ రెగ్యులర్ గా చెబుతునే ఉన్నారు జనాలతో టచ్ లో ఉండమని.

 

తాజా రిపోర్టు ప్రకారమైతే జగన్ చెబుతున్నా చాలామంది ఎంఎల్ఏలు జనాలకు అందుబాటులో ఉండటం లేదని అర్ధమైపోతోంది. అందుకనే తొందరలో ఓ  కార్యక్రమం రూపొందించాలని జగన్  డిసైడ్ అయ్యారట. దాని ప్రకారం జనాలతోనే మంత్రులు, ఎంఎల్ఏలు మమేకమయ్యేట్లు చూడాలని ప్లాన్ చేస్తున్నారు. మరి స్వయంగా రంగంలోకి జగనే దిగిన తర్వాత కూడా ఎంఎల్ఏల్లో కదలిక వస్తుందో రాదో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: