నైరుతి రుతుపవనాలు ఊరింపులతోనే సరిపెడుతున్నాయి. ఈ పాటికి వాగులు, వంకలతో ఉరకలెత్తాల్సిన క్రిష్ణా, గోదావరి నదులు నీళ్లులేక ఎడారిని తలపిస్తున్నాయి. ఇక ప్రధాన నీటి వనరులైన శ్రీశలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, సోమశిల తుంగభద్ర తదితర జలాశయాల్లో నీటిమట్టాలు ఎన్నడూలేని విధంగా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.  రాష్ర్టంలో నీటిపారుదల రంగం సాగునీటి జలాలపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన రిజర్వాయర్లపై ఆధారపడి క్రిష్ణా, గోదావరి కింద సాగుకావాల్సిన 71.59 లక్షల హెక్టార్ల ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారి ఖరీఫ్ సాగు ప్రశ్నార్దకంగా మారుతోంది.  కాల్వల ద్వారా నీటి పారుదల లేనికారణంగా చెరువులు, బోరుబావుల ఆధారంగా సాగు కావాల్సిన ఆయకట్టు కూడా వెలవెలబోతోంది. గతేడాది సైతం రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో వరుస కరువుల బారిన పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం 878 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాల్సి వచ్చింది.  చేతిలో ఉన్న సొమ్మంత పొలంలో పెట్టుబడిగా పెట్టి నష్టపోయిన రైతులు కనీసం ఈ ఏడాది పంటల ద్వారనైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చన్న ఆశతో ఉన్నారు. అయితే వర్షాలు కురవక, రిజర్వాయర్లు నిండక అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ర్టంలో ప్రధాన నీటి వనరులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీరు చేరాలంటే ముందుగా ఎగువన కర్ణాటకలో ఉన్న అల్మట్టి డ్యాం నిండాల్సి ఉంటుంది.  అయితే ఆ డ్యాంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇది కూడా డెడ్ స్టోరేజీ కంటే దిగువన ఉంది. 129 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్ గతేడాది ఇదే సమయానికి 55 టీఎంసీల నీరు ఉండేది. ఈ పరిస్థితుల్లో డ్యాం ఎగువన కర్నాటకలో భారీ వర్షాలు కురిసేదెన్నడు? డ్యాం నిండేదెన్నడూ అన్న సందేహాలు రాష్ర్ట నీటిపారుదల అధికారులను కలవరపెడుతున్నాయి.  డ్యాం నిండాలంటే 114 టీఎంసీల నీరు చేరాల్సి ఉంది. అప్పుడుగాని నీరు కర్ణాటకను దాటి రాష్ర్టానికి చేరుతుంది. ఈ పరిస్థితులన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే కనీసం రాష్ర్టంలో ఖరీఫ్ పంటల సాగుకు రెండు నెలల జాప్యం తప్పకపోవచ్చు. గోదావరి డెల్టాలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. గోదావరి బేసిన్ పరిధిలో 102 టీఎంసీల నిలువ నీటి సామర్థ్యమున్న జైక్వాడి డ్యాంలో ప్రస్తుతం 6.5 టీఎంసీలకు మించి నీరు లేదు.  రాష్ర్టం తొలివాకిట ఉన్న శ్రీరాంసాగర్ జలాశయం కూడా వెలవెలబోతోంది. 90.313 టీఎంసీల నిలువనీటి ఉన్న ఈ జలాషయం ప్రస్తుతం 7.4 టీఎంసీలకు మించి నీళ్లులేవు. పెన్నానదిపై ఉన్న సోమశిల డ్యాం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. 73.45 టీఎంసీల సామర్థ్యమున్న ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం 31.5 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో 48.4 టీఎంసీల నీరు ఉండేది.  ప్రధాన జలాశయాల్లో ఇన్ ఫ్లో పరిశీలిస్తే ఆల్మట్టి, కేసీసీ, క్రిష్ణా డెల్టా, నారాయణపూర్, శ్రీశైలం, ఉజ్జయినీ, జైక్వాడ్, లోయర్ మానేరు, నిజాంసాగర్, కండలేరు, సోమశిల, వీబీ ఆర్, వంశధార రిజర్వాయర్లలోకి చుక్కనీరు కూడా చేరడంలేదు. మిగిలిన వాటిలోకి వస్తున్న నీటి ప్రవాహం సగటున 1000 క్యూసెక్కులకు మించిలేవు. శ్రీశైలం నిండాలంటే 214 టీఎంసీల వరదనీరు ఎగువ నుంచి పోటెత్తాలి. నాగార్జన సాగర్ నిండాలన్న 179 టీఎంసీల ప్రవాహం రావాలి. 100 టీఎంసీలకు పైగా సామర్థ్యం ఉన్న తుంగభద్రలోనూ 96 టీఎంసీల మేరకు నీరు చేరాలి. వాతావరణ అనుకూలించి భారీ వర్షాలు కురిస్తే తప్ప రాష్ర్టంలోని ప్రధాన రిజర్వాయర్లలోకి రాదు. దేవుడు కరుణిస్తే తప్ప మనం చేసేదేమీలేదు 

మరింత సమాచారం తెలుసుకోండి: