కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అర్థాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలో కరోనా ఉదృతి లేకపోవడంతో ఐపీఎల్ సజావుగానే జరుగుతుందని భావించరంతా అయితే ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసరడంతో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఎంతోమంది ఐపీఎల్ ఆటగాళ్లు కూడా కోవిడ్ బారిన పడడంతో ఐపీఎల్ వాయిదా వెయ్యాక తప్పలేదు. ఇప్పటివరకు 21 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నా ఐపీఎల్ 14వ సీజన్, మిగిలిన 31 మ్యాచ్ లను కొనసాగిస్తారా లేదా అనే దానిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ మళ్ళీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో ( ఎస్ జీ ఏం ) ఐపీఎల్ నిర్వహణపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది కరోనా కారణంగా యూఏఈ లో ఐపీఎల్ నిర్వహించారు. అదే విధంగా ఈ ఏడాది కూడా యూఏఈ లోనే ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లను స్టార్ట్ చేస్తారని సమాచారం. అయితే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం జూన్ 2న యూకే వెళ్లనుంది టీమిండియా.

మొదట న్యూజిలాండ్ తో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తరువాత ఆగష్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్ తో 5టెస్టుల సిరీస్ అడనుంది. ఇక సెప్టెంబర్ 15 తరువాత నుంచి ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ 41 రోజుల పాటు జరగనుంది. అయితే ఐపీఎల్ నిర్వహించుకునేందుకు అనువుగా టెస్ట్ సిరీస్ ను కుదించుకునేందుకు ఇంగ్లాండ్ బోర్డ్ తో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతుందని సమాచారం. ఇక అక్టోబర్ లో టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశం ఉంది. నిజానికి ఈ వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ప్రస్తుతం భారత్ లో కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: