తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు జలాశయాలకు తరలివెళ్తున్నారు. మేళతాళాలతో కదులుతున్న వినాయకులతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన వేడుకలు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌ బండ్‌పై సందడి వాతావరణం నెలకొంది.  


హైదరాబాద్‌లో గణేశ శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత తర్వాత నిమజ్జనాల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ శోభయాత్ర జరిగే 18కిలో మీటర్ల మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. బాలపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకూ గల ఊరేగింపు మార్గంలో విగ్రహాలను తీసుకువెళ్లే వాటిని మినహా ఇతర వాహనాలను అనుమతించడం లేదు. చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, మొజాంజాహీ మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ, హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న ఈ మార్గంలో వాహనచోదకులు, ప్రజలు, ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కేవలం ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. 


ఈ ఒక్క రోజే 20 వేలకు పైగా గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఎలాగైనా అర్థరాత్రి వరకు  నిమజ్జనాలు పూర్తి కానిపక్షంలో రేపు కూడా ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, ఎన్టీఆర్‌ మార్గ్‌లో అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.  మరోవైపు హుస్సేనే సాగర్‌ ట్యాంక్‌ బండ్‌పై వినాయకుల నిమజ్జనాలను చూసేందుకు భారీగా వస్తున్నారు జనం. అయితే, తమ సొంత వాహనాల్లో కాకుండా బస్సులు, ఆటోలు వంటి ప్రజా రవాణా మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: