ఇంటర్నెట్ డెస్క్: అదో టీ20 మ్యాచ్. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఇంతలో ప్రేక్షకుల కేరింతల మధ్య ఇరు జట్ల కెప్టెన్లు, అంపైర్లు టాస్ వేయడానికి ఫీల్డ్ మీదకు వచ్చారు. టాస్ వేయడానికి సిద్ధమయ్యారు. టాస్ వేసేందుకుగానూ ఓ జట్టు కెప్టెన్‌ను అంపైర్ బ్యాట్ చేతికిచ్చాడు. మీరు కరెక్ట్‌గానే విన్నారు. టాస్ వేయడానికి బ్యాట్ ఇచ్చాడు. కాయిన్ కాదు. అంతేకాదు ఆ బ్యాట్ అందుకున్న కెప్టెన్ దానిని గాలిలోకి ఎగురవేస్తే ప్రత్యర్థి కెప్టెన్ తనకు కావలసిన సైడ్‌ను కూడా ఎంచుకున్నాడు. ఈ వింత టాస్ ప్రక్రియ బిగ్‌బాష్ లీగ్‌లో జరిగింది.

బిగ్‌బాష్ లీగ్ 2020-21లో భాగంగా పెర్త్ వేదికగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ సాధారణంగా వేసేటట్లు కాయిన్‌తో కాకుండా.. బ్యాట్‌తో వేశారు. అంపైర్లు ఇచ్చిన బ్యాట్‌ను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఆటగాడు బ్యాట్‌ను ఫ్లిప్ చేశాడు. అంతేకాదు ప్రత్యర్థి తప్పుగా కోరడంతో టాస్ కూడా గెలిచింది మెల్‌బోర్న్. బౌలింగ్ ఎంచుకుని మ్యాచ్‌కూడా గెలిచేసింది. రోటీన్‌కు భిన్నంగా వేసిన ఈ టాస్ అభిమానులకు కూడా చాలా తెగ నచ్చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వీడియోకు సంబంధించిన ఓ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఇకపై క్రికెట్‌లో ఇదే పద్ధతిలో టాస్ వేయాలని, అప్పుడే వెరైటీగా బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఇది న్యూట్రల్‌గా నిర్ణయం తీసుకోవడానికి వీలు పడదని, బ్యాట్ ఎప్పుడూ ఫ్లాట్‌గా ఉన్న వైపే నేలను తాకుంతుందని, అప్పుడు టాస్ గెలిచేందుకు బ్యాట్ ఫ్లిప్ చేసిన వ్యక్తికంటే ప్రత్యర్థికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి ఈ పద్ధతి ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితమా లేక, ఇక ముందు కూడా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇదే పద్ధతిని పాటిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: