జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎదురులేని నటుడు జూనియర్ ఎన్టీఆర్. అభిమానులు అతన్ని రాజకీయాలోకి రమ్మని పిలుస్తున్నా జూనియర్ మాత్రం పూర్తిగా నటన పైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఎటువంటి రాజకీయ అంశాల జోలికి పోవడం లేదు. కానీ ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం మనకి అడపాదడపా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఏ చిన్న పరిణామం జరిగినా తారక్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కావచ్చు, నారా భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, మొన్న చంద్రబాబు అరెస్ట్.. ఇలా తదితర పరిణామాలపై ఎన్టీఆర్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

ఈ విషయంలో ఓ వర్గం వారు అతనిని ట్రోల్స్ చేసారు కూడా. ఇటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల్లో మరోసారి తారక్ పేరు బలంగా వినిపిస్తోంది. తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని.. సినిమా రంగంలో బిజీగా ఉన్నానని తారక్ ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన ఫోటోను, పేరును బాగా వాడుకుంటున్నారు. తాజాగా కొడాలి నాని తన ఎన్నికల ప్రచారం, నామినేషన్ ర్యాలీలో తారక్ ఫోటోలను వినియోగించడం కొసమెరుపు. కొడాలి నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. తాజాగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే... ఎన్టీఆర్ అనుమతి లేకుండా కొడాలి నాని ఆయన ఫోటోను ప్రదర్శించగలరా? అన్న ప్రశ్న ఇపుడు బయట బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నాని ఈ చర్యలతో ఆయన వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ సైతం తారక్ ఫోటోలను వాడుకోవడం ఒకింత విడ్డురం అని చెప్పుకోవాలి. అవును, ఈ రాష్ట్రానికి భవిష్యత్ ముఖ్యమంత్రి తారక్ అంటూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. సీనియర్ నేత టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వినియోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: