ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో మాయం చేసిన పథకం ఏదనే ప్రశ్నకు వైఎస్సార్ ఆసరా స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. వైఎస్సార్ ఆసరా స్కీమ్ ద్వారా గతంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన జగన్ తాజా మేనిఫెస్టోలో ఈ స్కీమ్ కు చోటు కల్పించలేదు. సాధారణంగా ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ కు ఒకింత ఎక్కువ మొత్తం ఖర్చవుతుందని తెలుస్తోంది.
 
గత ఎన్నికల్లో వైసీపీ మహిళల మెప్పు పొందడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హామీ కీలక పాత్ర పోషించింది. ఈ హామీని తొలగించడం వైసీపీకి నష్టం చేసే అవకాశం ఉంది. జగన్ కచ్చితంగా డ్వాక్రా రుణమాఫీని ప్రకటిస్తారని భావించిన మహిళలు అలాంటి హామీ రాకపోవడంతో షాకయ్యారు. సున్నావడ్డీ స్కీమ్ ను మాత్రం కొనసాగిస్తానని జగన్ చెప్పడం కొసమెరుపు. 3 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ స్కీమ్ అమలవుతుందని జగన్ తెలిపారు.
 
మరీ భారీ మొత్తంలో హామీలను ప్రకటించడం సులువేనని అయితే ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించడం ద్వారా ఫలితం ఉండదని జగన్ భావించారని తెలుస్తోంది. మేనిఫెస్టో నిరాశ పరుస్తుందని జగన్ కు అవగాహన ఉన్నా ప్రజలను మోసం చేయలేక జగన్ మరీ భారీ మొత్తంలో పెంపుకు ఓకే చెప్పలేదు. వృద్ధులకు పింఛన్ పెంపు కూడా మరో మూడేళ్ల తర్వాత ఉంటుందని జగన్ వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది.
 
తను ప్రకటించిన పథకాన్ని ఎప్పటినుంచి కచ్చితంగా అమలు చేస్తానో కూడా చెబుతూ జగన్ ప్రజల మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేశారు. కూటమి హామీలు అమలు చేయాలంటే లక్షన్నర కోట్ల రూపాయలు కావాలని అంత మొత్తం ఖర్చు చేయడం సాధ్యం కాదని జగన్ తేల్చి చెబుతున్నారు. నవరత్నాలనే నమ్ముకుని మరోసారి ఎన్నికల రణరంగంలో తేల్చుకోనున్న జగన్ కు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: