ఈ రథోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం, మహాసమాధి సమీపంలో ఏర్పాటు చేసిన మహోత్సవ వేదిక వద్ద 1100 జంటలు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం విశేషం.సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు మరింత ప్రాభవం చేకూర్చుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి విచ్చేశారు. ఉదయం 9.30 గంటలకు సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం 10.15కు ప్రధాని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని, 10.30 నుంచి సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సత్యసాయి బాబా ప్రతిరూపంతో 100 రూపాయల స్మారక నాణెం, అలాగే నాలుగు ప్రత్యేక పోస్టల్ స్టాంపులు ఆవిష్కరించడం మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది.పుట్టపర్తి శత జయంత్యుత్సవాలు యావత్ ప్రపంచ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నవంబర్ 23న అధికారిక జయంతి నిర్వహించనున్నారు. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా ఏర్పాటుచేసింది. ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం, మధ్యాహ్నం తర్వాత ప్రధాని మోదీ పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బయలుదేరి కోయంబత్తూర్‌కు వెళ్లనున్నారు. ఈ శత జయంత్యుత్సవాలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా సత్యసాయి ట్రస్ట్ భవ్యంగా నిర్వహిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి