తొలుత టాస్ గెలిచిన కెన్యా కెప్టెన్ మారిస్ ఒడుంబే బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి బంతి నుంచే బాదడం మొదలు పెట్టింది. సనత్ జయసూర్య, రోమేష్ కలువిదర్ణ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి తమ ఇంటెన్షన్ చెప్పేశారు. రోమేష్ 18 బంతుల్లో 33 పరుగులు చేయగా.. జయసూర్య 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన అసంకా గురుసిన్హా, అరవింద డెసిల్వా ధాటికి కెన్యా బౌలర్లు వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. కెన్యా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బంతి పడితే బౌండరీనే అనేలా వీరబాదుడు బాదేశారు. గురుసిన్హా 103 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. డెసిల్వా 115 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో ఏకంగా 145 పరుగులు చేశాడు. ఇక రణతుంగ కూడా అంతే స్థాయిలో వీరవిహారం చేశాడు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులు చేసి కెన్యా బౌలర్లకు వీరవిహారానికి అసలు అర్థం నేర్పారు. ఇక కెన్యా బౌలర్లలో ఒడుంబే ఒక్కడే రెండు వికెట్లు తీసుకుని పర్వాలేదనిపించారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన కెన్యా ఆ స్కోరును ఛేదించలేక.. మొదటి నుంచే చతికిలబడింది. అంతేకాదు శ్రీలంక బౌలర్ల ముందు నిలవలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెన్యా తరపున స్టీవ్ టికోలో(90, 95 బంతుల్లో), హితేశ్ మోదీ(82 బంతుల్లో 41) కొద్దిగా బ్యాటు ఝుళిపించారు. ఫలితంగా శ్రీలంక జట్టు కెన్యాపై 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో మురళీధరన్ 2, రణతుంగ 2 వికెట్లు తీశారు. వాస్ కు 1, ధర్మసేనకు 1 వికెట్లు దక్కాయి. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక కొట్టిన ఫోర్లు, సిక్సుల రికార్డు చాలా కాలం వరకు ఎవరూ బీట్ చేయలేకపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి