మా అధ్య‌క్షుడిగా విష్ణుతోపాటు గెలుపొందిన ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే అస‌లు క‌థ ఇప్పుడే ప్రారంభ‌మైంది. రెండు కులాల మ‌ధ్య పోటీగా అభివ‌ర్ణిస్తూ గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చేసిన ప్ర‌చారం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌డింది. రాజ‌కీయ నేత‌ల స్వార్థం కోసం ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌, అందులో న‌టులు కూడా బ‌ల‌య్యారు. ఎన్నిక‌లు జ‌రిగిన‌ట్లుగా కూడా తెలియ‌కుండా అధ్య‌క్షులు ఎన్నిక‌య్యేవారు. అటువంటిది వారంతా వ‌ర్గాలుగా చీలిపోయి రోడ్డున ప‌డ‌టంతోపాటు సినీ ప‌రిశ్ర‌మ ప‌రువును కూడా రోడ్డుకు లాగారు. ఈ త‌రుణంలోనే ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ నేత‌లు త‌మ రాజ‌కీయం కోసం ఈ ఎన్నిక‌ల‌ను వాడుకున్న‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది. క‌మ్మ‌-కాపుల పోరుగా దీన్ని అభివ‌ర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు కూడా అలాగే ఈ పోటీని ఆస‌క్తిగా చూశారు. చివ‌ర‌కు ఒక వ‌ర్గం ఓట‌మిపాల‌వ‌గా, మ‌రోవ‌ర్గం గెలుపొందింది. గెలుపొందిన వ‌ర్గానికి చెందిన‌వారు అధికార పార్టీ నేత‌ల‌కు బంధువు అవుతారు. ఈ రాజ‌కీయ క్రీడ‌లో ఒక‌ర్ని మ‌రొక‌రు వారి వారి అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ఉప‌యోగించుకున్నారు. వారు అనుకున్న‌ది సాధించుకున్నారు. కానీ రావ‌ణ‌కాష్టంలా రాజేసిన కులాల కుంప‌ట్లు మాత్రం సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌ట్లో ఆరేలా క‌న‌ప‌డ‌టంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: