ఓ వైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతున్నా.. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నా.. మ‌రోవైపు ఆశాజ‌న‌మైక అంశాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. త‌మిళ‌నాడులో ఓ అద్భుతం జ‌రిగింది. చెన్నైకి చెందిన 84 ఏళ్ల మహిళ కోవిడ్ -19 పై పోరాడి గెలిచింది. ఈ రోజు చెన్నైలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింద‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. క‌రోనా బారిన ప‌డిన వారిలో ఎక్కువ‌గా వృద్ధులే మ‌ర‌ణిస్తున్నార‌ని అనేక నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నా.. అదే మ‌హ‌మ్మారిపై అక్క‌డ‌క్క‌డ ప‌లువురు వృద్ధులు విజ‌యం సాధిస్తున్నారు. ఇది ఎంతో ఆశాజ‌న‌మైన అంశ‌మ‌ని వైద్య‌వ‌ర్గాలు అంటున్నాయి. బామ్మ కోలుకోవ‌డం త‌మ‌కు ఎంతో ఆత్మ‌స్థైర్యాన్ని ఇచ్చింద‌ని, తాము చేస్తున్న చికిత్స‌పై న‌మ్మ‌కం పెంచుతోంద‌ని వైద్య‌వ‌ర్గాలు, ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  

 

ఇదిలా ఉండ‌గా.. త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 911 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 8మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య ప‌రంగా చూస్తే త‌మిళ‌నాడు దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా 1666 పాజిటివ్ కేసులు, మహారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా..  903 పాజిటివ్ కేసుల‌తో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఇక త‌మిళ‌నాడుకు సంబంధించి మ‌రో విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కోయంబత్తూరులో మ‌ద్యానికి బానిస అయిన ఓ వ్య‌క్తి హ్యాండ్ శానిటైజర్ తాగి మ‌ర‌ణించాడు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం బాధితులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈక్ర‌మంలో ఆ వ్య‌క్తి మ‌ద్యానికి బ‌దులు శానిటైజ‌ర్ తాగ‌డంతో మృతి చెందారు. అంత‌కుముందు మ‌రో ముగ్గురు మ‌ర‌ణించారు. ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: