వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో ఈ ఏడాది 50శాతం ఓబీసీలకు కేటాయించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అధికార పార్టీ అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.


ఈ ఏడాది వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం వల్ల ఈ రెండు పార్టీలూ కలిసి కోర్టును ఆశ్రయించాయి. అయితే, విద్యార్థులు జనవరి - ఫిబ్రవరి మాసాల్లో దరఖాస్తులు నింపినందున వారికి ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించడం ఈ ఏడాది సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది.జులై 27న ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు కూడా విచారణ జరిపింది. కేంద్ర నిర్వహణలో లేని విద్యా సంస్థల్లో ఆల్‌ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 50శాతం రిజర్వేషన్ల పరిశీలనకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, తమిళనాడు ఆరోగ్యశాఖ, అఖిలభారత వైద్య మండలితో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు కేంద్రానికి సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: