హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దావానంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో గాయపడిన అర్జున్, మనీష్, బిస్కీలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో అర్జున్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జీడిమెట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరగడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని... అటు అధికారులు కూడా ఏ మాత్రం తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మే నెల నుంచి ఇప్పటి వరకు పది పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని... ఏదో హాడావుడి చేస్తున్నారు తప్ప... ఆ తర్వాత కనీసం ఆ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదంటున్నారు స్థానికులు. ప్రమాదంలో గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: