మ‌న గుండెల్ని మెలిపెట్టే ఘ‌ట‌న ఇది.. ప‌గోళ్లకు కూడా ఇలాంటి క‌ష్టం రావొద్దంటూ క‌న్నీళ్లు పెట్టిన విషాదం. అమ్మ‌కే అమ్మ‌యి కంటికిరెప్ప‌లా కాపాడుకున్నాఆ దేవుడు క‌నిక‌రించ‌లేదు. అమ్మ‌ను బ‌తికించుకోవ‌డానికి ఆ చిట్టిత‌ల్లి కంటికికునుకులేకుండా క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం లేకుండా పోయింది. హృద‌యాల‌ను ద్ర‌వింప‌జేస్తున్న ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాలకు చెందిన కొలగాని గంగారెడ్డి, కమల దంపతులకు నాగలక్ష్మీ (17), మల్లికార్జున్ (13) ఇద్దరు పిల్లలున్నారు. సుమారు పదేళ్ల క్రితం గంగారెడ్డి చనిపోయాడు. అప్ప‌టి నుంచి కుటుంబ బాధ్య‌త కమలపై పడింది. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించింది. పిల్లలిద్ద‌రూ బ‌డికి వెళ్తున్నారు. ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డుతున్నాయ‌ని అనుకుంటున్న త‌రుణంలోనే పిడుగులాంటి వార్త‌. మూడేళ్ల క్రితం కమల టీబీ బారిన పడింది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల క‌మ‌ల‌ మంచాన పడింది. దీంతో 9వ తరగతి చదువుతున్న నాగలక్ష్మీ బడి మానేసి అమ్మ‌ను చూసుకునేది. త‌మ్ముడు చిన్న‌వాడు కావ‌డంతో బాధ్య‌తంతా నాగలక్ష్మి తీసుకుంది. గ్రామంలో పనులకు వెళ్తూ తల్లికి వైద్యం చేయించింది. తమ్ముడిని బడికి పంపిస్తోంది. ఈ క్ర‌మంలో సుమారు నెల రోజుల కిందటే ఓ మెడికల్ షాప్‌లో చేరి.. అక్క‌డి నుంచి అమ్మ‌కు అవ‌స‌ర‌మైన మందులు తీసుకుని వ‌చ్చేంది. 

 

అయితే.. అమ్మ ఆరోగ్యం బాగా విషమించడంతో నాగ‌ల‌క్ష్మి, మ‌ల్లికార్జున్  కలిసి సోమవారం ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే తాను బతకనని అర్థం చేసుకున్నత‌ల్లి క‌మ‌ల బిడ్డ‌ల‌ను చూసి క‌న్నీటిప‌ర్యంత‌మైంది. ఒకరికొకరు తోడుగా ఉండాలని.. తమ్ముడిని చదివించాల‌ని కూతురు క‌మ‌ల‌కు చెప్పింది. అలాగే అక్క పెళ్లి చేయాల‌ని కొడుక్కి చెప్పింది. క‌ష్ట‌ప‌డి బ‌తుకండి.. ఎవ‌రింటికీ పోవ‌ద్దు.. అంటూ క‌మ‌ల ఏడ్చింది. ఈ కొద్దిసేప‌టికే కమల ప్రాణాలు వదిలింది. అమ్మ లేద‌ని తెలుసుకున్న పిల్ల‌లు బోరున విలపించారు. అమ్మా.. ఇక మేం ఎలా బ‌తుకాలి అమ్మా.. మ‌మ్మ‌ల్ని వ‌దిలిపోయావా.. అమ్మా అంటూ పిల్ల‌లు గుండెల‌విసేలా రోదించారు. పిల్ల‌లు ఏడుస్తుంటే.. చుట్టుప‌క్క‌ల వాళ్లు కూడా బోరున విల‌పించారు. అయ్యో.. బిడ్డ‌లారా.. ఇంత చిన్న‌త‌నంలోనే ఎంత‌క‌ష్టం వ‌చ్చింది..అంటూ విల‌పించారు. క‌రోనా కార‌ణంగా క‌మ‌ల అంత్య‌క్రియ‌లు చేసేందుకు బంధువులు కూడా ఎవ‌రూ రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంట‌నే అక్క‌డికి వెళ్లి రూ. 5 వేల సాయం అంద‌జేశారు. అనాథ శవంలా మున్సిపల్ కార్మికులే క‌మ‌ల‌ అంత్యక్రియలు పూర్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: