కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం ఎంతగా వణికిపోతున్నదో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మనదేశం కూడా బాగా ఇబ్బంది పడిపోతోంది. కరోనా వైరస్ బయటపడినపుడు ఉన్నంత భయం జనాల్లో ఇపుడు లేదు. అయితే వైరస్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ప్రపంచదేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ దెబ్బకు కేసులు ఉధృతి తగ్గిందనే చెప్పాలి. అయితే కేసులు తగ్గగానే దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేశాయి. దాంతో  ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోవటం మొదలైంది. ఈ విషయంలో  మనదేశం కూడా మినహాయింపు కాదు.

 

ప్రస్తుతం మనదేశంలో నాలుగవ దశ లాక్ డౌన్ అమలవుతోంది. మొదటి  రెండు లాక్ డౌన్లను కఠినంగా అమలు చేసిన కేంద్రప్రభుత్వం తర్వాత సవరణలతో లాక్ డౌన్ను  ఫ్రీ చేసింది. నాలుగో లాక్ డౌన్లో జనాల మూమెంట్ చాలా ఫ్రీగా జరుగుతోందనే చెప్పాలి. ఎప్పుడైతే లాక్ డౌన్లో సవరణలతో ఫ్రీ చేసిందో అప్పటి నుండే దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరువలో ఉందంటేనే తీవ్రత ఎంతగా పెరిగిపోతోందో అర్ధమైపోతోంది. మొదటి లక్ష కేసులు నమోదవ్వటానికి 64 రోజులు పట్టింది. తర్వాత 2 లక్షల కేసులు నమోదవ్వటానికి 20 రోజుల్లోనే చేరుకుందంటే ఎంత స్పీడుగా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఈ నేపధ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి  దేశంలో ఐదవ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో కేంద్రప్రభుత్వం  ఉందంటూ ప్రచారం పెరిగిపోతోంది.  ఈ విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వాల్లో మిశ్రమ స్పందన కనబడుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లాక్ డౌన్ అమలు చేస్తే కరోనా వైరస్ నియంత్రణకు అవకాశం ఉంది. అదే సమయంలో  యావత్ దేశం ఆర్ధికంగా కుదేలైపోతుంది. అంటే ఒకవైపు దేశ ఆర్ధిక పరిస్ధితి మరోవైపు జనాల ప్రాణాలకు రక్షణ. నిజానికి రెండూ ముఖ్యమే అయినా రెండింటిలో ఏది ముఖ్యమన్నపుడు జనాల ప్రాణాలను రక్షించటానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయనటంలో సందేహం లేదు.

 

అయితే ఇపుడు లాక్ డౌన్ విషయంలోనే జనాలతో పాటు ప్రభుత్వాల్లో కూడా అయోమయం మొదలైందనే చెప్పాలి.  లాక్ డౌన్ పొడిగింపుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యతిరేకంగా ఉన్నారు. లాక్ డౌన్ను పొడిగించే ఆలోచనేది తనకు లేదని స్పష్టం చేశాడు. అయితే జనాలందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే అని చెప్పాడు. రద్దీ ప్రాంతాలకు వెళ్ళవద్దని, కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం ప్రకటించిన నిబంధనలను జనాలు పాటించకపోతే అప్పుడు లాక్ డౌన్ విషయాన్ని ఆలోచిస్తానని చెప్పాడు.

 

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ పొడిగింపుకు వ్యతిరేకంగానే ఉన్నాడు. లాక్ డౌన్ ను పొడిగించాలని తమ ప్రభుత్వం అనుకోవటం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ ప్రకటించటం గమనార్హం. తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడిగింపును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ సిఎం పళనిస్వామి స్పష్టం చేశాడు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఏపి, తెలంగాణా ప్రభుత్వాల ఆలోచన ఏమిటో తెలియటం లేదు. నిజానికి లాక్ డౌన్ మినహాయింపులతో ఫ్రీ చేసిన తర్వాతే రెండు రాష్ట్రాల్లోను కేసులు విపరీతంగా పెరిగిపోతోంది.

 

ఈనెల 16, 17 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడితో జరిగే వీడియో కాన్ఫరెన్సులో  సిఎంలు తమ నిర్ణయాలను చెప్పేస్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఎలాగూ కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు లేవు. కాబట్టి తమ నిర్ణయాలను గట్టిగా చెప్పగలిగితే జగన్, కేసీయార్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్ లాంటి వాళ్ళే చెప్పాలి. అంటే మరో రెండు రోజుల్లో  లాక్ డౌన్ పొడిగింపు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అర్ధమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: