మరో పదిరోజుల్లోనే చిన్నమ్మగా పాపులరైన శశికళ పరప్పన జైలు నుండి విడుదలయ్యే అవకాశాలున్నాయా ? అవుననే అంటున్నారు శశికళ తరపున లాయర్ సెంథూరు పాండ్యన్ . గురువారం చెన్నైలోని మీడియాతో పాండ్యన్ మాట్లాడుతూ కర్నాటకలోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న శిశికళ దసరాపండుగ సెలవులు అయిపోగానే విడుదలయ్యే అవకాశాలున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆమె లాయరే ప్రకటించారు కాబట్టి విడుదలకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.  దసరాపండుగ సందర్భంగా కర్నాటకలో కోర్టులకు సెలవులని పాండ్యన్ చెప్పారు. సెలవులైపోగానే కోర్టులు ప్రారంభమవుతాయన్నారు. అప్పుడు గతంలో శశికళకు కోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమాన చెల్లింపు విషయంలో క్లారిటి వస్తుందన్నారు. పది కోట్ల రూపాయలను చెల్లించటానికి చిన్నమ్మ సిద్ధంగా ఉన్నట్లు కూడా లాయర్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.




అధికారికంగా ఎటువంటి వ్యాపారాలు చేయకుండా, వృత్తుల్లో లేకుండానే శశికళ రూ. 10 కోట్ల జరిమానా చెల్లించటానికి సిద్ధపడ్డారంటే అంత డబ్బు  ఎక్కడి నుండి వస్తోందన్నది ప్రధాన సందేహం. అసలు శశికళకు జైలుశిక్ష పడిందే అక్రమార్జన కేసు మీదన్న విషయం అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా/సన్నిహితురాలిగా శశికళ ప్రపంచానికి పరిచయం అయ్యారు. జయలలిత పక్కన  ఉంటునే మెల్లిగా పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టారు. పార్టీలోని నేతలను తన దగ్గరకు రప్పించుకునే వారని సమాచారం. పార్టీ విషయాల్లో శశికళ జోక్యం పెరిగిపోతోందన్న విషయాన్ని గ్రహించగానే జయలలిత సన్నిహితురాలిని తన ఇంట్లోనుండి బయటకు పంపేసింది. అయితే తెరవెనుక ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు కానీ మళ్ళీ కొంతకాలానికి జయలలిత ఇల్లు వేదనిలయంలో శశికళ ప్రత్యక్షమయ్యింది. అప్పటి నుండి చిన్నమ్మకు మళ్ళీ పూర్వవైభవం మొదలైపోయింది.




అప్పటికే జయలలితపై నమోదైన అక్రమార్జన కేసులో కోర్టు శశికళను కూడా భాగస్ధురాలిని చేసి శిక్ష విధించింది. కొంతకాలానికి ఇద్దరు బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత మళ్ళీ విచారణను ఎదుర్కొన్నారు. విచారణ తమిళనాడు నుండి కర్నాటక హైకోర్టుకు మారినా శిక్షలో పెద్దగా మార్పురాలేదు.  తుది వాదనలు విన్న తర్వాత  కర్నాటక హైకోర్టు జయలలిత, శశికళకు జైలు శిక్ష విధించింది. అయితే తుదితీర్పు రాకముందే జయలలిత అనారోగ్యంతో మరణించటంతో శశికళకు ఒక్కదానికే నాలుగు సంవత్సరాల జైలుశిక్ష పడింది. సరే మనదేశంలో జైలుశిక్షలు పడిన ఖైదీలకు ఏదో మిషతో శిక్షా కాలాన్ని తగ్గించటం మామూలే కదా. ఇందులో భాగంగానే శిశకళకు కూడా నాలుగేళ్ళ జైలుశిక్ష  పూర్తికాకుండానే  మినహాయింపులు ఇచ్చారు. దీని ప్రకారం మొత్తం శిక్షలో 130 రోజులు తగ్గిపోయినట్లు సమాచారం.




ఇదే సమయంలో జరిమానా రూ. 10 కోట్లు కట్టడానికి చిన్నమ్మ రెడీ అయిపోవటంతో దసరా పండుగ తర్వాత కోర్టులు మొదలవ్వగానే శిక్షాకాలంపై నిర్ణయం తీసుకుని విడుదల చేస్తారని లాయర్ పాండ్యన్ ఆశాభావంతో ఉన్నారు. మరి నిజంగానే శశికళ గనుక విడులైతే తమిళనాడు ఎన్నికలు అనూహ్య మలుపు తిరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. జైలుశిక్ష పడిన కారణంగా శశికళ పోటీ చేయలేకపోయినా మళ్ళీ ఏఐఏడిఎంకె పార్టీ పగ్గాలు తీసుకంటారా ? లేకపోతే పార్టీని చీల్చేసి తన మద్దతుదారుడు స్ధాపించిన కొత్తపార్టీలో కలిపి పగ్గాలే అందుకుంటారా ? అన్నది చూడాల్సిందే. ఏదేమైనా శశికళ విడుదల అన్నది వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో కీలకం అవుతుందనే అనుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: