ఇపుడిదే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తిరుపతి లోక్ సభ అభ్యర్ధిగా బీజేపీ రత్నప్రభను ఎంపిక చేసింది. రత్నప్రభ అంటే ఎవరికీ తెలీదు. ఒకపుడు కొంతకాలం మన రాష్ట్రంలో పనిచేశారంతే. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభది కర్నాటక క్యాడర్. డిప్యుటేషన్ మీద ఏపిలో కొంతకాలం పనిచేశారు. తర్వాత డిప్యుటేషన్ ముగియటంతో మళ్ళీ కర్నాటకకు వెళ్ళిపోయారు. అక్కడే చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయారు. ఆమె భర్త విద్యాసాగర్ కూడా ఐఏఎస్ అధికారే. ఇది స్ధూలంగా రత్నప్రభ నేపధ్యం. రాష్ట్రంలో ఎవరికీ తెలెనీ ఆమెను లోక్ సభ అభ్యర్ధిగా పార్టీ ఎందుకు ఎంపిక చేసిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
నిజానికి పార్టీ తరపున పోటీ చేసే స్ధాయిలో గట్టి అభ్యర్ధి లేరనే చెప్పాలి. అయితే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేసేందుకు బాగా ఆసక్తి చూపినట్లు పార్టీ నేతలే చెప్పారు. రావెలది గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం. ఈయన కూడా ఒకపుడు ఉన్నతాధికారే. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. వెంటనే మంత్రికూడా అయిపోయారు. అయితే వివిధ కారణాల వల్ల చంద్రబాబునాయుడుతో పడకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం జనసేనలో ఉన్న తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. మంచి మాటకారి కూడా.
రావెల కాకపోతే మరో గట్టి నేతను నిలబెట్టకుండా ఎవరికీ తెలీని ఓ అధికారిని అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారంటేనే పార్టీ పరిస్దితి ఏమిటో అర్ధమైపోతోంది. ఈమెకు పార్టీలోని నేతల్లో ఎంతమంది సహకరిస్తారో అనుమానమే. మామూలుగానే పార్టీ పరిస్ధితి చాలా అధ్వాన్నంగా ఉంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో కమలం పార్టీ తరపున 8 మంది అభ్యర్ధులు పోటీచేశారు. 50 డివిజన్లకు గాను బీజేపీ పోటీచేసింది 8 చోట్ల. 8 డివిజన్లలో కలిపి పార్టీకి వచ్చిన ఓట్లు సుమారు 300 కూడా లేవు. దీంతోనే తెలిసిపోతోంది పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. పార్టీలో పాపులర్ నేతలు చాలామందే ఉన్నా వాళ్ళంతా మీడియా సమావేశాల్లోను, తిరుపతికి వచ్చిన ప్రముఖులను ఎయిర్ పోర్టుల్లో రిసీవింగ్ అండ్ సెండాఫ్ లో మాత్రమే కనబడుతుంటారు. మరి రత్నప్రభ లక్ ఎలాగుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి