వైఎస్‌. జ‌గ‌న్ , సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల పంప‌కం వార్ తారాస్థాయికి చేరుకుంది. ష‌ర్మిల చెపుతోన్న‌ట్టు తన తండ్రి ఆస్తులు అన్నీ కుటుంబ ఆస్తులు అనే భావనలో ఉంది. ఆ ఆస్తులు పూర్తిగా జగన్‌కు చెందేవి కాదని, జగన్ వాటిని కుటుంబ ఆస్తుల “ గ్యార్డియన్ ” మాత్రమే అని ష‌ర్మిల చెపుతోంది. తండ్రి అనుకున్నట్లుగా ఆస్తులను స‌మానంగా పంచాల్సి ఉన్నా ఇప్పటికీ ఆ విధంగా పంచకటానికి ఎలాంటి చర్యలు జరగలేదని ఆమె పేర్కొన్నారు. ఈ రాజకీయ - కుటుంబ వివాదం కేవలం ఆస్తుల కోసం మాత్రమే కాదు, దానికంటే పాలిటికల్ గా ప్రభావం చూప‌నుంది. ష‌ర్మిల ప్ర‌స్తుతం ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా కూడా ఉన్నారు. తన రాజకీయ అవసరాల కోసం కూడా జగన్‌ పై విమర్శలు చేస్తూ, రాజకీయంగా అస్తిత్వం కోసం ఆమె పోరాడుతోంది. ఇది కేవలం కుటుంబం మధ్య చిన్నపాటి సమస్యగా కాదు, పెద్ద రాజకీయ పోరాటంగా కూడా మారుతోంది.


రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను ష‌ర్మిల దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)కి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల సంబంధిత ఒప్పందాలను రద్దు చేసుకుంటాన‌ని కూడా జ‌గ‌న్ త‌న కౌంట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ వివాదానికి కార‌ణంగా ఉన్న ఆస్తులు అన్నీ త‌న స్వార్జితంగా జ‌గ‌న్ త‌న కౌంట‌ర్‌లో దాఖ‌లు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో పాటు జ‌గ‌న్ భార్య భార‌తి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేశారు.


తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్‌ విజయమ్మ పేరుపైకి బదిలీ చేశారని .. వీటిని ర‌ద్దు చేయాల‌ని కూడా వారు పిటిష‌న్‌లో కోరారు. దీనిపై ష‌ర్మిల అప్పీల్ చేయ‌డంతో ఆమెకు ఈ వ్య‌వ‌హారంలో ఎలాంటి చ‌ట్ట బ‌ద్ధ‌మైన హ‌క్కులు లేవ‌న్నారు. ఈ విష‌యంలో ష‌ర్మిల‌కు అప్పీల్ చేసే అర్హ‌త కూడా లేద‌ని జ‌గ‌న్ త‌న కౌంట‌ర్‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఈ వాటాల‌ బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్‌ చేయడం వెనుక ఉద్దేశాలపై జ‌గ‌న్ కొన్ని డౌట్లు వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు జగన్‌ ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: