దీనిలో భాగంగా ఇటీవల మిత్రమండలి ముఖ్య నేతలతో ఆశకిరణ్ భేటీ అయ్యారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు సాగాలి, ప్రజలకు చేరువయ్యే మార్గాలు ఏమిటి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేవలం రాజకీయ ప్రసంగాలు కాకుండా, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కార దిశగా కృషి చేయాలన్న ఆలోచనతో ఆమె ఉన్నట్టు సమాచారం.
వాస్తవానికి ఆశకిరణ్‌పై కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలన్న ముద్ర ఉంది. అయితే ఆ ఇమేజ్‌ను పక్కనపెట్టి, అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా, కులం, మతం, రాజకీయాలకతీతంగా స్పందిస్తానని, సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని ఆమె ఇటీవల పలువురు అనుచరులతో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని రాధా రంగా మిత్రమండలి సభ్యులకు కూడా ఆమె స్పష్టంగా తెలియజేశారు. తన తొలి ప్రజా ప్రయాణాన్ని ఏలూరు లేదా తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలన్న ఆలోచనలో ఆశకిరణ్ ఉన్నారు. ముఖ్యంగా ఈనెల 26న ఆమె తండ్రి, దివంగత రంగా వర్ధంతి ఉండటంతో, ఆ రోజు నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ, కార్యకర్తల సమీకరణ, రాధా రంగా మిత్రమండలి ఐక్యత వంటి అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ముందుగా తనను తాను ప్రజాసేవ ద్వారా నిరూపించుకున్న తర్వాతే రాజకీయంగా అడుగులు వేయాలన్నది ఆశకిరణ్ వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడం ఖాయమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అంతకుముందే తన తండ్రి వారసత్వంగా వచ్చిన సానుభూతిని పూర్తిగా సొంతం చేసుకుని, వ్యక్తిగత ఇమేజ్‌ను బలపర్చుకోవాలన్న ఆలోచనతో ఆమె ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. పార్టీకి అతీతంగా ప్రజల్లోకి రావాలన్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రాజకీయాలకు అతీతంగా ఎంతమంది ఆమె వెంట నడుస్తారన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి