టీడీపీ అదినేత చంద్ర‌బాబు తాజాగా చేప‌ట్టిన దీక్ష స‌క్సెస్ అయింది. క‌రోనా బాధితుల‌కు ప్ర‌తి ఒక్క‌రికీ రూ.10 చొప్పున ఇవ్వాల‌ని.. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున సాయం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తూ.. నిర‌స‌న దీక్ష‌ను కొన‌సాగించారు. దీనికి రాష్ట్రంలోని టీడీపీ నేత‌లు కూడా స‌హ‌క‌రించార‌నే చెప్పాలి. అయితే.. కొన్ని కొన్ని జిల్లాల నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. అనంత‌పురంలో జేసీ వ‌ర్గం దూరంగా ఉంది. ఇక‌, గుంటూరులో ధూళిపాళ్ల న‌రేంద్ర కూడా దీక్ష‌కు దూరంగా ఉండి.. త‌న మానాన త‌ను.. మీడియా మీటింగ్ పెట్టి బాధ‌లు చెప్పుకొచ్చారు.

విజ‌య‌న‌గ‌రంలోనూ అశోక్ గ‌జ‌పతిరాజు స‌హా.. గ‌తంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న బొబ్బిలి రాజులు కూడా దూరంగా ఉన్నారు. విశాఖ‌లోనూ గంటా శ్రీనివాస‌రావు అజా లేరు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ మాత్రం స‌క్సెస్ అయింద‌ని ప్ర‌క‌టించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్ర‌బాబు అనుస‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు మాత్రం త‌ప్ప‌లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు ఆయ‌న‌ను తీవ్రంగా ప్ర‌శ్నించారు. మీరే సీఎంగా ఉంటే మీరు చెబుతున్న సాయం చేసేవారా? అని ప్ర‌శ్నించిన వారు కూడా ఉన్నారు.

అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు.. రాష్ట్ర బ‌డ్జెట్ కూడా చాల‌ని నిధులు అడిగి.. రాజ‌కీయం చేయ‌డం.. స‌రైన చ‌ర్యేనా అని నిల‌దీశారు. ఇలా మొత్తంగా చూస్తే.. దీక్ష స‌క్సెస్ అయినా.. అనేక‌ప్ర‌శ్న‌లు మాత్రం మిగిలిపోయాయి. అదేస‌మ‌యంలో పార్టీలో ఉన్న అనైక్య‌త మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. సాక్షాత్తూ చంద్ర‌బాబు సైతం దీక్ష‌లో కూర్చుంటే.. జిల్లాల్లో నేత‌లు మాత్రం తినిప‌డుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. దిగువ శ్రేణి నేత‌లు త‌ప్పితే.. కీల‌క నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

ఇక‌, రాజ‌మండ్రి లోనూ పెద్ద‌గా నిర‌స‌న ప్ర‌భావం క‌నిపించ‌లేదు. ఇక‌, ఇదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన దిశ యాప్‌పై మాత్రం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. చాలా మంది యాప్‌ను ప‌రిశీలించే ప‌నిలో ప‌డ‌డంతో టీవీల‌ను చూడ‌లేద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా చంద్ర‌బాబు దీక్ష‌.. స‌క్సెస్‌.. రిజ‌ల్ట్ జీరో.. అన్న విధంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: