టీడీపీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తోందా.. ఏదోలా ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తోందా.. అందుకే గుడివాడలో జరిగిన సంక్రాంతి సంబరాల ఇష్యూను క్యాసినో రేంజ్‌లో ప్రచారం చేసి రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఈ సంక్రాంతి సంబరాల సమయంలో తాను గుడివాడలోనే లేనని స్వయంగా మంత్రి కొడాలి నాని చెబుతున్నాడు. కరోనా వస్తే చికిత్స కోసం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరానని వివరణ ఇస్తున్నారు.


అయితే.. ఆయన గుడివాడలో లేనంత మాత్రాన ఈ క్యాసినో ఘటనలో తనకు బాధ్యత లేదని చెప్పలేం.. మంత్రిగారి సొంత ఊరు.. అందులోనూ ఆయన కన్వెన్షన్‌ ప్రాంతంలో జరిగిన ఘటన కాబట్టి అందులో ఆయన స్వయంగా పాల్గొనాల్సిన పని లేదు. మంత్రి పరపతి కారణంగానే అటువైపు పోలీసులు కూడా పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. కానీ.. సంక్రాంతి సమయంలో అలాంటి జూదాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉంటారు. గుడివాడ ఘటన ఏమాత్రం సమర్థనీయం కాకపోయినా.. ఈ ఇష్యూని ఇంతగా ప్రమోట్‌ చేసి.. ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయి మాత్రం లేదు.


కానీ.. ఎందుకు టీడీపీ ఈ ఇష్యూను ఇంకా కొనసాగిస్తోంది.. మొదట మీడియాలో ప్రచారం.. ఆ తర్వాత నిజనిర్థరణ కమిటీ పేరిట హంగామా.. ఆ తర్వాత డీజీపీ, గవర్నర్‌లకు ఫిర్యాదులు.. ఇలా ఈ ఇష్యూలో ఏదో ఒక డెవలప్‌మెంట్ ఉండేలా టీడీపీ టార్గెట్‌ చేస్తోంది. బహుశా కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగింపజేసేలా జగన్ పై ఒత్తిడి తెచ్చే  వ్యూహంలో భాగం కావచ్చు..


వైసీపీలో ఏ జంకూ గొంకూ లేకుండా చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టగల నేతగా కొడాలి నానికి గుర్తింపు ఉంది. అందులోనూ కమ్మ సామాజిక వర్గం నేత కావడం వల్ల కొడాలి నాని తిడితే దానికి కాస్త ప్రయారిటీ ఉంటుంది. అలా కొడాలి నాని కంట్లో నలుసుగా మారినందువల్ల అతడిని టార్గెట్‌ చేసి.. ఎలాగైనా మంత్రి పదవి నుంచి తొలగించాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: