త్వరలో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందా.. ఈ పెనుముప్పు ఏ అణ్వాయుధంతోనో.. మరో కరోనా తరహా వైరస్‌ తోనో కాదు.. మరి ఇంకా ఏంటనుకుంటున్నారా.. అదే ఎప్పటి నుంచో మానవాళికి పెద్ద శత్రువు.. అదే ఆకలి.. అవును.. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది దాదాపు 53 దేశాల్లోని 20కోట్ల మంది ఆహార భద్రత లేక ఆకలితో నకనకలాడారాట.


మరి ఈ ఆకలి సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా.. దేశాల మధ్య ఘర్షణలు, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలు, సుదీర్ఘ కరవులు. వీటితో పరిస్థితులు క్రమంగా దిగజారిపోతున్నాయట. ప్రపంచ దేశాలు కలసి పనిచేయాలన్నీ కలసి కట్టుగా ఈ ఆహార సంక్షోభాన్ని అడ్డుకోకపోతే.. భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.


ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యూరోపియన్ యూనియన్ కలిపి ఈ ఆహార సంక్షోభంపై సర్వే చేసింది. దీని ఆధారంగా ఓ అంతర్జాతీయ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2021లో 53 దేశాల్లో 20 కోట్ల మంది ఆకలితో ఇబ్బంది పడ్డారట. ప్రపంచవ్యాప్తంగా రోజూ ఆహారం దొరకని వారి సంఖ్య 4 కోట్లు పెరిగిందట. ప్రత్యేకించి ఇథియోపియా, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్,  అఫ్గానిస్థాన్,కాంగో లాంటి దేశాల్లోని ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయట.


ధరల పెరుగుదల, నిరంతర హింసతో 2022లో ప్రపంచంలోనే అత్యంత ఆహార సంక్షోభాన్ని సోమాలియా ఎదుర్కొంటోందట. ఆ దేశంలో 60 లక్షల మంది సోమాలియా వాసులు తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి ఉన్నారట. ఈ ఆహార సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐరాస పిలుపు ఇచ్చింది. భారీ ఎత్తున సాయం అందించాలని కోరింది. 2016లో 11శాతం ఉన్న తీవ్ర ఆహార సంక్షోభం 2021 నాటికి 22 శాతానికి పెరిగింది. మరోవైపు సహాయం చేసే దేశాలు తమ  ఆర్థిక సాయాన్ని తగ్గించేశాయట. కొవిడ్ తరహాలోనే ఆహార సంక్షోభ పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు చేతులు కలపాలని ఐరాస కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

uno