టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పై సమర భేటీ మోగించారు. వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా పార్టీని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి ఇవాళ్టి నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర మంతటా అన్ని వర్గాల వారికి చేరువయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరగాలని ఆయన నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.


మరోవైపు చంద్రబాబు వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలు ధీమాగా ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పాలనను తరిమికొట్టేందుకు, ప్రజల్ని చైతన్యం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.  జగన్ పాలనకు చరమగీతం పాడాలని అన్ని రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో అన్నారు.


పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చంద్రబాబు పర్యటించనున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి  తెలిపారు. ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు చినరాజప్ప, జవహర్ లతో కలిసి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి  సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ  నేతలు భూ కబ్జాలు, హత్యలకు పాల్పడుతున్నారని మాజీ హోం మంత్రి చినరాజప్ప కూడా ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం జరగదని భావించడంవల్లే వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు.


వైఎస్ వివేకా కేసును తెలంగాణకు బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు టీడీపీ నేతలు  చెప్పారు. జగన్ పాలనలో అండగా ఉండేందుకే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ కూడా అన్నారు. మొత్తం మీద మరోసారి పార్టీలో ఊపు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎంత మేర ఫలిస్తుంది.. దీన్ని వైసీపీ ఎలా కౌంటర్‌ చేస్తుంది.. దీనికి ప్రతిగా ఏమైనా కార్యక్రమం ఆ పార్టీ చేపడుతుందా.. అన్నది ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: