రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు పూర్తయ్యాయి. 2024 జూన్ 10న అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగింది. ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాల ఫలితాలు, ప్రజల్లో ప్రతిస్పందన ఎలా ఉందో టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల మరోసారి సమీక్షించారు. పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులతో చర్చిస్తూ, ఒకవైపు ప్రభుత్వ పనితీరు, మరోవైపు పార్టీ బలం రెండింటినీ నిరంతరం అంచనా వేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆలోచన ప్రకారం, ప్రజల్లో ఉన్న బలం, ఎన్నికల సమయానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటినుంచే స్పష్టంగా ఉంచుకోవాలి. ఈ దిశగా, గత 15 నెలల కాలంలో పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆయన ఇతర వర్గాల నుంచి సమాచారం తెప్పించడంతో పాటు, స్వయంగా ఐవిఆర్ఎస్ సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం, టిడిపి ప్రస్తుతం కూడా స్పష్టమైన మెజారిటీ స్థాయిలోనే ఉందని, ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు.


అయితే ఆరు నెలల క్రితం వైసిపి పుంజుకుంటుందన్న చర్చ వినిపించింది. దీనికి కారణం టిడిపి నాయకులు ఇసుక, మద్యం వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. ఈ అంశాలు చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను ఆయన నేరుగా హెచ్చరించారు. మంత్రులను సైతం వదిలిపెట్టకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వల్ల, పార్టీ ఇమేజ్ మళ్లీ మెరుగుపడిందని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వపరంగా సూపర్ సిక్స్ పథకాల అమలు, పెట్టుబడుల రాక, ఉపాధి కల్పన, డీఎస్సీ నిర్వహణ, ప్రతి నెలా ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ, పేదలతో సీఎం మమేకమయ్యే తీరు..  ఇవన్నీ ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగించాయి. పార్టీ పరంగా ఎమ్మెల్యేల నియంత్రణ, ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన వైఖరి, ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ పరిస్థితిని సమీక్షించడం వంటి చర్యలు చంద్రబాబుకు ప్లస్‌గా మారాయి.


సీనియర్ నాయకులకు ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు రంగాల్లోనూ (ప్రభుత్వం, పార్టీ) అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా బాధ్యులను కఠినంగా ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ అనుకూలంగా ఉందని, ఈ స్థితిని రాబోయే నాలుగేళ్లపాటు కొనసాగిస్తే మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవచ్చని చంద్రబాబు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: