ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలా మారిపోయింది. గత‌ 15 నెలలుగా ఈ పార్టీ పూర్తిగా సోషల్ మీడియాలోకే పరిమితమైపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోల్పోయిన వెంటనే ప్రజాదరణ కూడా కోల్పోతారని భావించడం తప్పు. కానీ, వైసీపీ విషయంలో ఆ భ్రమనే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి రాకపోవడం, నాయకుల మాట వినకపోవడం, కార్యకర్తలతో దూరంగా ఉండటం వల్ల పార్టీ బలహీనతలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. గత పాలనలో చేసిన తప్పులు, మేళ్ల గురించి ప్రజల్లో చర్చ జరగాలి. కానీ ప్రస్తుతానికి వైసీపీ గురించిన చర్చ అంటే ఎక్కువగా గత పాలనలోని తప్పుల గురించే వినిపిస్తోంది. ప్రజలకు చేరువయ్యేలా కొత్త కార్యక్రమాలను రూపకల్పన చేయకుండా, అసెంబ్లీలో గళం వినిపించకుండా జగన్ దూరంగా ఉండడం పార్టీకి పెద్ద లోటుగా మారింది.


వాస్తవానికి ఒక ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలి. కానీ, జగన్ తీరు చూస్తుంటే నిరుత్సాహం, నిర్లక్ష్యం ఎక్కువైపోయిందన్న భావన కలుగుతోంది. పార్టీ నాయకుల వాదన ప్రకారం, మూడు అంశాల్లో జగన్ తప్పనిసరిగా మార్పు తీసుకురావాల్సి ఉంది. మొదటిది, నాయకుల మాట వినడం. అనేక మంది నేతలు ఎన్నికల తరువాత పార్టీకి దూరమైపోయారు. కొందరు బయటకే వెళ్లిపోయారు. వీరందరినీ ఒకచోట చేర్చి లోపాలను సరిచేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, కార్యకర్తలకు చేరువ కావడం. గతంలో వలంటీర్లపై ఆధారపడిన జగన్, ఇప్పుడు కార్య‌కర్త‌లను బలోపేతం చేస్తామన్న మాట చెప్పినా, అది కార్యాచరణలో కనిపించడం లేదు. మూడవది, జనాల్లోకి రావడం. సమస్యలు ఉన్నప్పుడే కాకుండా, కార్యక్రమాలను సృష్టించుకొని అయినా ప్రజల మధ్య ఉండే నైపుణ్యం నాయకుడికి అవసరం. చంద్రబాబు ఈ విధానాన్ని గతంలో అనుసరించిన ఉదాహరణగా చూపుతున్నారు.


ఇక పార్టీ వ్యవహారాల్లోనూ మార్పులు అవసరమని నేతలే చెబుతున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉన్న ఇన్చార్జిలు, ప్రజల్లో ఆదరణ లేని నేతలను పదవుల్లో పెట్టడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరిగింది. కనీసం వార్డు స్థాయిలో గెలవలేని నాయకులను పైస్థాయిలో పెట్టడం ద్వారా పార్టీ అంతర్గతంగా ఆత్మన్యూనత భావం పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ 15 నెలల కాలంలో జగన్ సాధించిన ప్రత్యేక ఫలితం ఏదీ లేకపోవడమే కాకుండా, కేసుల్లో ఇరుక్కున్న నేతలను పరామర్శించడం మినహా ఆయన ప్రజలకు దూరంగానే ఉన్నారని వ్యతిరేకులు అంటున్నారు. ప్రజల సమస్యలపై స్పందించకపోవడం, వారిని విస్మరించడం వల్ల “జగన్ ప్రజల కోసం లేరు” అన్న వాదన బలపడుతోంది. ఈ పరిస్థితిని మార్చుకోక‌పోతే పార్టీ భ‌విష్య‌త్తు ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: