భారతరాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కుటుంబంలో ఏర్పడిన అంతర్గత వివాదం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఈ కలహాల్లో ఎమ్మెల్సీ కవిత ఒంటరిగానే మిగిలిపోయారన్న భావన రాజకీయ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. పార్టీ నుంచి ఆమెను దూరంగా ఉంచడమే కాకుండా, కుటుంబలో కూడా ఆమెకు దూరం పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది అనేది ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే స్పష్టంగా తెలుసు. కవిత తన తండ్రి కేసీఆర్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం. మొదట్లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కేటీఆర్‌ను టార్గెట్ చేసినట్లుగా ఉన్నా... ఇటీవల మాత్రం ఆమె దృష్టి పూర్తిగా హరీష్ రావుపైనే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్‌పై వరుసగా ఆరోపణలు చేస్తూ, అక్రమాలు, కమీషన్లు, వ్యాపార సంబంధాల ఆరోపణలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
అయితే కవిత చేసిన ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి పత్రాధారాలు బయటకు రాలేదన్నది మరో కోణం.
ఇక హరీష్ రావు విషయానికి వస్తే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఒకసారి మాత్రమే సాదాసీదాగా ఖండించారు. ఆ తర్వాత పూర్తిగా మౌనం వహిస్తున్నారు. రాజకీయ పరిశీలకుల ప్రకారం, కవిత ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రతి మాట మరింత వివాదానికి దారి తీసే ప్రమాదం ఉంది. పైగా కుటుంబ సంబంధాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు హరీష్ రావు పూర్తిగా సంయమనం పాటిస్తున్నారని వర్గాలు అంటున్నాయి. కవిత రాజకీయ దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటనే ప్రశ్న కూడా బాగా చర్చకు వస్తోంది. కొందరి అభిప్రాయం ప్రకారం, హరీష్ రావును పార్టీ నుంచి దూరం చేయడం, ఆయన ప్రభావాన్ని బలహీనపరచడం అనే రాజకీయ వ్యూహం ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఒక మెయిన్ పిల్లర్.
కేవలం కేసీఆర్ మేనల్లుడు అయినందుకే కాదు, ఆయనకు ఉన్న ప్రజా అనుభవం, నిర్వహణా నైపుణ్యం పార్టీని ఎన్నో సందర్భాల్లో నిలబెట్టాయి. అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి దూరం చేస్తే బీఆర్ఎస్‌లో పెద్ద మార్పులు సంభవించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుల మధ్య గ్యాప్ గతంలో నుంచే ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత చేసిన రాజకీయ ప్రయత్నాలు ఆ గ్యాప్‌ను మరింత పెంచేలా ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కుటుంబంలో విభేదాలు పెరిగితే, రాజకీయ లాభనష్టాలు పూర్తిగా మారిపోతాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు కీలక మలుపులోకి వెళ్లాయి. కవిత వ్యూహం ఫలిస్తుందా? హరీష్ రావు మౌనం ఎంత వరకు కొనసాగుతుందా? తదుపరి పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయా? అన్న ప్రశ్నలపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి