ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు మరియు తరువాత వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నాయకుల పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. గత ఎన్నికల ముందు వైసీపీని వీడి వివిధ పార్టీల్లో చేరిన పెద్దలు చిన్నలు ఎంతోమంది ఉన్నారు. కొందరు జనసేనలో చేరారు, మరికొందరు బీజేపీకి వెళ్ళారు, ఇంకొందరు టీడీపీ బాట పట్టారు. అయితే వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే టికెట్లు సాధించగలిగారు. అంతేకాకుండా ఇద్దరికిపైగా మాత్రమే మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. ఈ లెక్క చూస్తే పార్టీల మార్పుతో పెద్ద ప్రయోజనం సాధించిన నేతలు చాలా తక్కువగా ఉన్నారు. ఇక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీల్లో చేరిన నేతల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. వీరిలో చాలామంది ఇప్పటికీ ఎక్కడా సరిగ్గా సర్దుకోలేకపోతున్నారు.


ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ నేతలు ఏం చేయాలో అర్థం చేసుకోలేక ఆందోళన చెందుతున్నారని వారి అనుచరుల మాటల్లో తెలుస్తోంది. వైసీపీలో ఉన్నప్పుడు ప్రభావవంతంగా ఉన్న అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ లాంటి నాయకులే ఇప్పుడు పార్టీల మార్పు తర్వాత తమ నియోజకవర్గాల్లో త‌మ ప‌ట్టు కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, ఒక నాయకుడు ప్రజల మధ్య ఉండటమే రాజకీయంగా నిలబడే బలం. అయితే పార్టీలు మారిన నేతలు ఈ అంశంలో వెనుకంజ వేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలకు చేరువ కావాలనే బాధ్యతను వారు సరిగా నిర్వర్తించకపోవడం వల్ల వారి పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తి తగ్గిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.


ఎన్నికల సమయంలో ప్రజల మూడ్ ఎలా మారుతుందో చెప్పలేని ప‌రిస్థితి. ప్రస్తుతం మాత్రం ఈ జంపింగ్‌ చేసిన నేతల పట్ల ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఈ పరిస్థితిని వీరు కూడా గ్రహించినట్లే ఉంది. ఎందుకంటే వీరిలో చాలామంది ఇప్పుడు పార్టీ నాయకత్వం దృష్టిలో పడాలనే కోరికతో పరోక్ష సంకేతాలు పంపుతున్నారని ప్రచారం. తమకు ఏదైనా పదవి లేదా బాధ్యత ఇవ్వాలని లోబడి ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయా పార్టీలు వీరిని ఎలా వినియోగించుకుంటాయో, భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తాయో చూడాలి. ప్రస్తుతం పరిస్థితి ఇలానే కొనసాగితే, పార్టీల మార్పు చేసిన నాయకుల ప్రభావం మరింత తగ్గిపోవడం ఖాయం. ప్రజల మధ్య మళ్లీ తమ స్థానాన్ని తెచ్చుకోవడం కోసం వీరు కష్టపడకపోతే, రాజకీయంగా మరింత ఇర‌కాటం త‌ప్ప‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: