ఏపీలో వచ్చే 2029 సాధార‌ణ‌ ఎన్నికల్లో ప్రజలు తమను తప్పక గెలిపిస్తారనే నమ్మకంతో వైసీపీ అధినేత జగన్ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నా, ఏ విజయమైనా ముందస్తు వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో టీడీపీ కూడా ముందస్తుగా వ్యూహాలు సిద్ధం చేసుకోవ‌డం వ‌ల్లే పార్టీని తిరిగి బలోపేతం చేసుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా కార్య‌కర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించడానికి, వైసీపీ ప్రభుత్వంలో పెట్టబడిన కేసులతో తలెత్తిన భయాన్ని తగ్గించడానికి చంద్రబాబు స్వయంగా రోడ్ల మీదకు వచ్చి పార్టీవారిని ఉత్సాహపరిచారు. దీనికి యువగళం పాదయాత్ర మరింత ఊపునిచ్చింది. ఫలితంగా కార్య‌కర్తల్లో నూతన ఉత్తేజంతో పార్టీ బ‌ల‌ప‌డింది.


ఈ తరహా ముందస్తు వ్యూహాలు వైసీపీ కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని పార్టీలో పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే జగన్ కానీ, పార్టీ సీనియర్లు కానీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న‌ ప్రాంతాలను గుర్తించాలనే అవసరాన్ని గ్రహించినట్టుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని వైసీపీ నేతలలో కొంతమంది నిర్ణయించుకున్నార‌ని టాక్ ? జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ బలహీనత ఉంది? ఏమి చేయాలి? అనే అంశాలపై అధినేత జగన్ దృష్టి పెట్టాలని కోరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తొలి సమీక్ష గుంటూరు జిల్లాతోనే ప్రారంభమవుతుందన్న ప్రచారం సాగుతోంది.


గుంటూరు జిల్లా ఎందుకు కీలకం అంటే… ఇది రాజధాని ప్రాంతం. అమరావతిని వ్యతిరేకించిన తర్వాత, మూడు రాజధానులకు మ‌ద్ద‌తు తెలిపిన నేపథ్యంలో గుంటూరులో వైసీపీ పూర్తిగా వెనుకబడిపోయింది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ స్థానంలో వైసీపీ ఇప్పటివరకు ఒక్క సీట్లో కూడా విజ‌యం సాధించ‌లేదు. ఈ క్ర‌మంలోనే వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి గుంటూరులో కనీసం కొన్ని స్థానాలు గెలచుకోవాలంటే ఇప్పటినుంచే పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరమని నేతలు సూచిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేయడంలో విఫలమైన సమన్వయ కర్తలను మారిస్తే మంచిదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.


గత ఎన్నికల తరువాత గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకలాపాలు చాలా స్లో అయిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ప‌ల్నాడు ప్రాంతంలో నేతలు మీడియా ముందుకు రాని ప‌రిస్థితి. ఒక‌రిద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు అప్పుడప్పుడూ స్పందించినా అంత‌కుమించి చేసేదేం ఉండ‌డం లేదు. గుర‌జాల‌, ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, గుంటూరు వెస్ట్, తెనాలి, మంగళగిరి వంటి అనేక నియోజకవర్గాల్లో వైసీపీ జెండా కనిపించని స్థితి ఏర్పడింది. నేతలు ప్రజల మధ్యకి వెళ్లడం లేదు, కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. ఈ నేపథ్యంలో సమీక్షలు జరిపి, పని చేయని నేతలను మార్చాలని స్థానిక నాయకుల డిమాండ్ బలపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: