ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కొన్ని అనూహ్య వివాదాలు మరియు గుండె కోత మిగిల్చిన విషాదాలకు వేదికైంది. ప్రభుత్వానికి పాలనాపరంగా కొన్ని సవాళ్లు ఎదురైతే, సామాన్య ప్రజలకు భద్రత మరియు రక్షణ పరంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరిగిన ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట‌లో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అలాగే, సింహాచల అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి ఆరుగురు భక్తులు మృతి చెందడం, శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం భక్తజనాన్ని కలిచివేసింది. ఈ ఘటనలు ఆలయాల వద్ద భద్రతా లోపాలను ఎత్తిచూపాయి.


ప్రమాదాలు మరియు సామాజిక భద్రత :
రహదారి ప్రమాదాలు ఈ ఏడాది కూడా తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా కర్నూలు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై, పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు, మహిళలు మరియు బాలికల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినా, రాష్ట్రంలో అక్కడక్కడా జరిగిన అఘాయిత్యాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.


రాజకీయ వివాదాలు - క్షేత్రస్థాయి సవాళ్లు :
రాజకీయంగా చూస్తే, ఇసుక మరియు మద్యం వ్యవహారాలు ప్రభుత్వ ప్రతిష్టను కొంతమేర దెబ్బతీశాయి. సొంత పార్టీ నాయకులే ఈ వ్యవహారాల్లో తలదూర్చడం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. ముఖ్యంగా:
విజయవాడ ఎంపీ vs తిరువూరు ఎమ్మెల్యే: కొలికపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ మధ్య చెలరేగిన అంతర్గత విభేదాలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.


ఉత్తరాంధ్రలో కూటమి నేతల మధ్య భూముల విషయంలో తలెత్తిన ఘర్షణలు రాజకీయంగా కాకరేపాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాల్లో వెనక్కి తగ్గడం విశేషం. తొలుత పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవడం, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును నిలిపివేయడం వంటి చర్యలు ప్రజలకు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. అదే సమయంలో, ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై రాజకీయంగా తన దూకుడును ప్రభుత్వం ఏమాత్రం తగ్గించలేదు. ఫైన‌ల్‌గా 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కు అటు అభివృద్ధి లక్ష్యాలు, ఇటు విషాద సంఘటనల కలయికగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: