ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2025 సంవత్సరం సంక్షేమ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. 2025లో ఈ పథకాల ప్రస్థానం ఎలా సాగిందో విశ్లేషిస్తే.. ప్రభుత్వం సాధించిన విజయం స్పష్టమవుతుంది.


తల్లికి వందనం : రికార్డు స్థాయి లబ్ధి
సూపర్ సిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం 'తల్లికి వందనం'. తొలుత జూన్‌లో ప్రారంభించాలనుకున్నా, సాంకేతిక కారణాల వల్ల ఆగస్టు నుంచి అమలు చేశారు. అయితే, ఆలస్యమైనా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ నిధులు ఇస్తామని చెప్పిన విధంగానే, ఆరుగురు, ఏడుగురు పిల్లలు ఉన్న పేద కుటుంబాలకు కూడా నిధులు జమ చేసి రికార్డు సృష్టించారు.


అన్నదాత సుఖీభవ : రైతుకు భరోసా
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రభుత్వం గాడిలో పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న రికార్డుల లోపాలను సరిదిద్ది, జూన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేశారు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో కలిపి రైతులకు ఒక్కొక్కరికి రూ. 7000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్‌లో రెండో విడత కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.


నిరుద్యోగులకు ఊరట: మెగా డీఎస్సీ
యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ప్రక్రియను 2025లోనే ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది. 6 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలను ఎక్కడా న్యాయపరమైన చిక్కులు రాకుండా పారదర్శకంగా భర్తీ చేశారు. ఇది నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది. అలాగే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 15,000 ఇచ్చే పథకాన్ని కూడా ఇదే ఏడాది అమలులోకి తీసుకువచ్చారు.


పీ-4 మోడల్: పేదరిక నిర్మూలనకు సరికొత్త అడుగు :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన పీ -4  కాన్సెప్ట్ ఈ ఏడాది ఆచరణలోకి వచ్చింది. పేదలను సంపన్నులు దత్తత తీసుకునే ఈ వినూత్న కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు 200 కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. మంత్రులు సవిత, సంధ్యారాణి వంటి వారు కూడా ఈ బాటలోనే నడిచి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.


మొత్తంగా చూస్తే, 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో 'సంక్షేమ నామ సంవత్సరంగా' చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిధులను విడుదల చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: