భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డి ఇక అసాధ్య‌మేనా...వంద‌ల్లోంచి వేల‌లోకి పాజిటివ్ కేసుల సంఖ్య ప‌రుగెడుతోందా..? మ‌ందులేని ఈ మాయ‌దారి రోగానికి ప్రాణాలుపోవాల్సిందేనా..? ఇంట్లో కూర్చుంటే కూడా వ్యాధి రాక‌మాన‌దా అంటే..? అవున‌నే అంటున్నారు వైద్య నిపుణులు. భార‌త్‌లో కోవిడ్ దూకూడు పెర‌గ‌డంతో సోమ‌వారం ఒక్క రోజే 99 కేసులు కొత్త‌గా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్రం వైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 498 కరోనా బాధితులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇందులో కొంత‌మంది ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వెంటిలేష‌న్‌పై చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.


అయితే రెండు రోజులుగా  భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 99 కరోనా వైరస్ కేసులు నమోదు కావ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. గత మూడు రోజుల్లోనే కొత్తగా 246 మందికి కరోనా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసే బులిటెన్‌లో మ‌రెన్నో కేసులు న‌మోద‌వుతాయోన‌ని దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా మ‌రో రెండు రోజుల్లో 1000కి పైగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిన ఆశ్చ‌ర్యం లేద‌ని కొంతమంది వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

 

టెస్ట్ కిట్స్ లేక‌పోవ‌డంతో చాలా మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌ర‌గ‌డం లేదు. ఇక కిట్స్ అందుబాటులోకి వ‌చ్చి ప‌రీక్ష‌ల నిర్ధార‌ణ పూర్త‌యితే మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశం ఖ‌చ్చితంగా ఉంద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా హైద‌రాబాద్‌, పుణె, ముంబై లాంటి న‌గ‌రాల్లో క‌రోనా వైర‌స్ స్టేజీ-2 నుంచి స్టేజి-3కి చేరుకుంటోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి ముగ్గురికి వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతున్న విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. క‌రోనాను నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. భార‌త్ మ‌రో ఇట‌లీ కాకూడ‌ద‌ని వేడుకుంటున్నారు. కరోనా వ్యాధితో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: