న్యూఢిల్లీ: కరోనాను నిర్మూలించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌లు రెడీ అవుతున్నాయి. ఒకటి, లేదా రెండు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మాస్కులు వాడాల్సిందేనా..? శానిటైజర్లను వినియోగించాల్సిందేనా..? అంటే అవుననే చెబుతోంది భారత వైద్య పరిశోధన మండలి.. ఐసీఎంఆర్. వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన కరోనాను పూర్తిగా నిర్మూలించలేమని, దీర్ఘకాలం పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాపై పూర్తి స్థాయిలో విజయం సాధించగలుగుతామని చెబుతున్నారు.

దీనిపై కోల్‌కతాలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కరోనా మేనేజ్‌మెంట్-ఛేంజెస్ ఓ వెబినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భారత వైద్య పరిశోధన మండలి చీప్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ చక్కటి పురోగతి సాధిస్తోందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా భార్గవ మాట్లాడుతూ.. ‘కరోనా కట్టడి కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రజలు దీర్ఘకాలం పాటు మాస్కులు ధరించాలి. మాస్కులు అంటే దుస్తులతో చేసిన వ్యాక్సిన్ లాంటిది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉంద’ని చెప్పారు. అంతేకాకుండా ‘వచ్చే ఏడాది జులై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలనేదే లక్ష్యం. ఆ తరువాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకోవడంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా భారత్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంద’ని వివరించారు.

మొత్తం 24 వ్యాక్సిన్ తయారీ యూనిట్లు, 19 సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయని, ప్రస్తుతం 5 వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, వాటిలో 2 భారత్‌లో తయారు కాగా.. మిగిలిన 3 విదేశాలల్లో రూపొందిస్తున్నారని తెలిపారు. అయితే.. కరోనాను అంతం చేయాలంటే.. వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను సుదీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలంతా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే కరోనాను పూర్తిగా జయించగలుగుతామని భార్గవ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41,810 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 496 మరణాలు సంభవించాయి. 42,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 93,92,919కు చేరింది. వీరిలో 88 లక్ష మందికి పైగా కోలుకున్నారు. 4,53,956 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 6 లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: